యువతతోనే వారసత్వ సంపదకు భద్రత

23-10-2026 | 05:31pm

రామప్పలో 12 రోజుల ప్రపంచ వారసత్వ స్వచ్ఛంద సేవా శిబిరం

వెంకటాపూర్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదపై యువత అవగాహన పెంచుకొని, వాటి విశిష్టతను సమాజానికి తెలియజేయాలని సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ(Sammakka Sarakka Central Tribal University) ఉపకులపతి శ్రీనివాస్ సూచించారు. చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించేందుకు యువత పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ పర్యాటక శాఖ సౌజన్యంతో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామప్పలో నిర్వహిస్తున్న ప్రపంచ వారసత్వ స్వచ్ఛంద సేవా శిబిరం–2026 కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా పర్యాటక నోడల్ అధికారి డా.ధర్మానాయక్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 35 మంది స్వచ్ఛంద సేవకులు ఈ 12 రోజుల శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా ఉపకులపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పర్యాటకం, సంస్కృతి, వారసత్వం, భూగర్భ శాస్త్రం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవడానికి ఈ శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నేర్చుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవాలని, చారిత్రక ప్రదేశాల ప్రాధాన్యాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, వాటి పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.

అనంతరం జిల్లా పర్యాటక నోడల్ అధికారి డా.ధర్మానాయక్ మాట్లాడుతూ.. శిబిరం నిర్వహణకు పర్యాటక శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని, పర్యాటక పోలీసుల ద్వారా భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని, రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించినప్పటి నుంచి వరుసగా ఐదో ఏడాది ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారని, రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు సాధించడంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ చేసిన కృషిని వివరించారు.

కార్యక్రమంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధి ప్రొఫెసర్ పాండురంగారావు, శిబిర సమన్వయకర్త శ్రీధర్ రావు, పురావస్తు శాఖ పరిరక్షణ సహాయకుడు భార్గవ్, పర్యాటక శాఖ అధికారులు, ఆలయ పూజారులు హరీష్ శర్మ, ఉమాశంకర్, పర్యాటక మార్గదర్శకులు విజయ్ కుమార్, వివిధ శాఖల సిబ్బంది, వివిధ రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు