నీటి నిల్వలు.. వచ్చే వేసవికి భరోసా
కొల్లాపూర్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (Palamuru-Rangareddy Lift Irrigation Project) ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్‌లో ఆరు టీఎంసీల నీటిని నింపి, అక్కడి నుంచి పాలమూరు–రంగారెడ్డి మొదటి కాలువ స్లూయిస్ ద్వారా ఎల్లూరు రిజర్వాయర్‌కు తాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. మరో మూడు నెలల్లో నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటి సరఫరా (Water Supply) చేసేందుకు కాలువ పనులను వేగవంతం చేస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ముందుచూపుతో తీసుకుంటున్న చర్యలతో తాగునీటి సమస్య తీరనుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌ను నింపేందుకు ప్రధాన కాలువ ఇంటేక్ వాల్ (Intake Wall) వద్ద ఏర్పాటు చేసిన స్లూయిస్ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళిక (Advance Planning)తో నార్లాపూర్ రిజర్వాయర్‌లో ఆరు టీఎంసీల నీటిని నింపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోని రెండు మోటార్లను సోమవారం ఆన్ చేసి నీటిని పంపింగ్ (Water Pumping) చేయనున్నట్లు పేర్కొన్నారు.
నార్లాపూర్ రిజర్వాయర్‌ను ఇప్పుడే పూర్తిస్థాయిలో నింపుకుంటే వచ్చే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఎల్లూరు రిజర్వాయర్‌కు నీటిని తరలించవచ్చని మంత్రి వివరించారు. ఎల్లూరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గినప్పుడు నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి స్లూయిస్ ద్వారా నీటిని అందించి, మిషన్ భగీరథ (Mission Bhagiratha) ద్వారా ప్రజలకు తాగునీటి సరఫరా చేయవచ్చని తెలిపారు.
వచ్చే వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా నార్లాపూర్ రిజర్వాయర్‌ను నింపాలనే మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. మరో మూడు నెలల్లో నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసేందుకు పెండింగ్‌లో ఉన్న కాలువ పనులను యుద్ధప్రాతిపదికన (War Footing) పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆ వెంటనే ఏదుల రిజర్వాయర్‌కు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నీటిని అందించనున్నట్లు వెల్లడించారు.