మారణకాండ
అమెరికాలో ఒకే ఇంట్లో ఘోరం.. గర్భిణీ, చిన్నారులు సహా 8 మంది బలి!
అమెరికాలోని పెన్సిల్వేనియా(Pennsylvania mass shooting) రాష్ట్రం ఎరీ నగరంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒక ఇంటి వద్ద ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు, ఎనిమిది నెలల గర్భిణీ సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు(shooting) పాల్పడిన వ్యక్తి కూడా అక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే ఇంటి బయట 51, 37 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయి కనిపించారు. అనంతరం ఇంట్లోకి వెళ్లిన పోలీసులకు మరో ఆరుగురి మృతదేహాలు కనిపించాయి. వారిలో ఐదేళ్లు, ఏడాది వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మిగతా బాధితుల్లో 24, 44 ఏళ్ల మహిళలు, 19, 21 ఏళ్ల యువకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సాయం కోసం పొరుగువారిని ఆశ్రయించిన మహిళలు
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను పరిశీలించినట్లు ఎరీ పోలీస్ చీఫ్ రిక్ లోరా(Erie Police Chief Rick Lorah) వెల్లడించారు. కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు మహిళలు పొరుగువారి సహాయం కోసం ప్రయత్నించినట్లు వీడియోల్లో కనిపించిందని తెలిపారు. అనంతరం నిందితుడు బయటకు వచ్చి వారిపై కాల్పులు జరిపినట్లు భావిస్తున్నామని చెప్పారు. అయితే ఈ దారుణానికి దారితీసిన అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన ఇంట్లో కనిపించిన దృశ్యాలు తనను తీవ్రంగా కలచివేశాయని పోలీస్ చీఫ్ పేర్కొన్నారు. నిందితుడి మానసిక ఆరోగ్యం కూడా ఈ ఘటనలో కీలక అంశమై ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు కాల్పుల వెనుక కారణంపై స్పష్టత రాలేదు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: గవర్నర్
ఈ ఘటనపై పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో(Pennsylvania Governor Josh Shapiro ) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎరీలో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి, స్థానిక సమాజానికి తన సానుభూతి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. అమెరికాలో జరిగిన ఈ Pennsylvania Mass Shooting ఘటన మరోసారి తుపాకీ హింసపై ఆందోళనలను తెరపైకి తెచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోవడం, చిన్నారులు కూడా ఈ విషాదంలో బలవడం స్థానికులను కలచివేసింది. కాల్పులకు గల కారణాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.