నిరుపేదకు మంత్రి కోమటిరెడ్డి భరోసా
- మూగ, చెవిటి దంపతుల బిడ్డకు అండగా నిలిచి.. మెరుగైన వైద్యం
- వైద్యులతో మాట్లాడి శస్త్రచికిత్స
- మరో 2 లక్షల ఆర్థికసాయం
- చిన్నారి విద్యా బాధ్యతలూ తనవేనని వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి, వారి చిన్నా రికి మెరుగైన వైద్యం అందేలా స్వయంగా చొరవ తీసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనిగిరి గ్రామానికి చెందిన జంపాల మహేష్ కుమార్, రజిత దంపతులిద్దరూ వినికిడి, మాటల సమస్యలతో బాధపడుతున్నారు.
వారికి జన్మించిన బిడ్డ కూడా అదే సమస్యతో పుట్టడం తో ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చిన్నారికి సరైన వైద్యం అందిస్తే మాట్లాడే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల్లో ఆశ చిగురించింది. అయితే, చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని తెలియడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ దంపతులు రెండు రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఆశ్రయించారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్న మంత్రి వెంటనే స్పందించి రూ.2 లక్షల తక్షణ సాయం అందించారు.
అంతటితో ఆగకుండా, చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులతో స్వయంగా మాట్లాడి అవసరమైన చికిత్స చేయిస్తానని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అంతేకాదు హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో చిన్నారిని చేర్పించి శస్త్రచికిత్స చేయించారు. చికిత్స పూర్తయిన అనంతరం మంత్రి నేడు ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని ఆప్యాయం గా పలకరించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, మరో 2లక్షలు సాయం అందజేశారు.
చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచి, బిడ్డకు చికిత్స చేయించిన మంత్రికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారికి భవిష్యత్తులో విద్యకు సంబంధించిన పూర్తి బాధ్యతలను తానే తీసుకుంటానని మంత్రి ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్నారి భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
మరో బాలిక మనస్విని ఉన్నత విద్యకు హామీ
తల్లిదండ్రులను కోల్పోయి ఇబ్బందిపడుతున్న నిరుపేద బాలికకు తాను అండగా ఉంటానని, ఉన్నత చదువులకు అయ్యే ఖర్చునంతా భరిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా, కట్టంగూర్ మండలం, చండూర్ గ్రామానికి చెందిన రాజగోపాల మనస్విని అనే బాలికకు తల్లితండ్రులు ఇద్దరూ లేరు. ప్రస్తుతం ఆమె పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకుం టోంది.
శనివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసిన సదరు బాలిక, కుటుంబ సభ్యులు అమ్మాయి ఎదుర్కొంటున్న ఇబ్బందు లను విన్నవించారు. వెంకట్‌రెడ్డి బాలికతో మాట్లాడి, ఆమె యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ‘ప్రస్తుతం ఏం చదువుతున్నావు? భవిష్యత్తులో ఏం కావాలని అకుంటున్నావు?’ అని మంత్రి ప్రశ్నించగా...తాను ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నానని, భవిష్యత్తులో బాగా చదువుకొని ‘డాక్టర్’ కావాలనేది తన లక్ష్యమని మనస్విని తెలిపింది.
ఆ బాలిక లక్ష్యాన్ని, పట్టుదలను మెచ్చుకున్న మంత్రి.. ‘ప్రతీక్ ఫౌండేషన్’ ద్వారా ఆమె ఉన్నత విద్యకు కావాల్సిన పూర్తి సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. బాలిక భవిష్యత్తుకి అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.