ఉచిత న్యాయ సలహాలకు టోల్ ఫ్రీ నెంబర్ 15100
జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నిహారిక
బిజినేపల్లి, అక్టోబర్ 09 : న్యాయవాదిని(Lawyer) పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని వారికి ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని, ఎవరికైనా ఉచిత న్యాయ సలహాలు(Free legal advice) కావాలంటే 15100 అనే టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నిహారిక(Niharika) అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నాగరుకర్నూల్(Nagarkurnool) ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని వట్టెం గ్రామ పంచాయతీలో(Vattem Gram Panchayat) న్యాయ విజ్ఞాన సదస్సు(Legal Knowledge Conference) నిర్వహించారు.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నిహారిక హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చట్టాల పట్ల కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. చట్టాల పట్ల అవగాహన ఉండడం వల్ల సమాజంలో నేరాలు అరికట్టవచ్చని, తద్వారా నేర రహిత సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. అదే విధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అందిస్తున్న ఉచ్చిత న్యాయ సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరామ్ ఆర్య, వట్టెం సర్పంచ్ పిట్టల జ్యోతిశంకర్, పంచాయతీ కార్యదర్శి మహేష్ నాయక్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.