వివరణ లేకుండా 70 లక్షల ఓట్లే తొలగింపు!
- తొమ్మిది రాష్ట్రాల్లో తుది ఓటరు జాబితాలను జనాభా గణాంకాలతో పోల్చిన ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా
- దేశంలో 18 ఏళ్లు పైబడిన వారు 100.8 కోట్లుగా అంచనా
- వీరిలో ఓటర్లుగా నమోదైన వారు 92.2 కోట్లు!
- 9 రాష్ట్రాల్లో సర్ తుదిజాబితాలో ఉండాల్సిన ఓటర్లు 53.51 కోట్లు
- ఓటర్లు ఉన్నది మాత్రం 52.78 కోట్లని వెల్లడి
- సర్ తొలగించిన 13.37 కోట్లలో చాలా వరకు సబబేని స్పష్టం
న్యూఢిల్లీ, అక్టోబర్ 18: దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(Special Intensive Revision of Electoral Rolls) (సర్) ప్రక్రియలో కోట్లాది పేర్లు తొలగించిన నేపథ్యంలో, ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా చేసిన విశ్లేషణ చర్చనీయాంశంగా మారింది. తొమ్మిది రాష్ట్రాల్లో తుది ఓటరు జాబితాలను జనాభా అంచనా లతో పోల్చిన ఆయన.. సుమారు 70 లక్షల మంది ఓటర్ల విషయంలో తొలగింపులకు సరైన వివరణ కనిపించడం లేదని అంచనా వేశారు.
అయితే, ముసాయిదా దశలో తొలగించిన 13.37 కోట్ల పేర్లలో చాలా వరకు సమర్థనీయమైనవేనని ఆయన పేర్కొన్నారు. శనివారం ప్రచు రించిన తన విశ్లేషణలో, మరణం, స్థానమార్పిడి, పునరావృతం వంటి చట్టబద్ధమైన కారణాలతో తొలగించబడిన పేర్లతో సహా, సర్ తన మూడు దశలలోని ముసాయిదా-దశ తొలగింపులను కూడా ఈ 13 కోట్ల సంఖ్యలో లెక్కిస్తున్నారని భల్లా వాదించారు. తుది ఓటర్ల జాబితా లు ఇంకా ప్రచురించబడని రాష్ట్రాలను కూడా ఇందులో చేర్చారని పేర్కొన్నారు.
ఎస్‌ఐఆర్ మూడు దశలలో ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13.37 కోట్ల పేర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వీటిలో, రెండో దశలో బీహార్‌తోపాటు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 7.22 కోట్లు, మూడో దశలో 17 రాష్ట్రాల నుంచి 6.15 కోట్లు తొలగించినట్లు ఉన్నాయి. క్లెయిమ్‌లు, అప్పీళ్లపై విచారణ జరగక ముందే ఈ తొలగింపులు నమోదయ్యాయని భల్లా పేర్కొన్నారు. రాయిటర్స్ ఉటంకించిన డేటా ప్రకారం..
వీటిలో మరణించిన 2.8 కోట్ల మంది ఓటర్ల పేర్లు, వేరే ప్రాంతాలకు తరలివెళ్లిన 6.3 కోట్ల మంది, కోటి డూప్లికేట్ ఎంట్రీలు, ఆచూకీ తెలియని మూడు కోట్ల మంది ఉన్నారు. అయితే సుర్జిత్ భల్లా తన విశ్లేషణలో 2011 జనగణన గణాంకాలు, జననాలు, మరణాలు, వలసలు, వయోజన జనాభా అంచ నాలను పరిగణనలోకి తీసుకున్నారు. 2026 మధ్య నాటికి దేశంలో 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య సుమారు 100.8 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేశారు.
వీరిలో ఓటర్లుగా నమోదు కానివారి (8.5శాతం)ని మినహాయించి, ఓటరు జాబితాల్లో ఉండాల్సిన వారి సంఖ్యను లెక్కిం చారు. ఈ లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా సుమారు 92.2 కోట్ల మంది ఓటర్లుగా నమోదు అయి ఉండవచ్చని అంచనా వేశారు. అనంత రం తుది సర్ జాబితాలు వెలువడిన తొమ్మిది రాష్ట్రాల్లో అంచనా ప్రకారం ఓటర్లు 53.51 కోట్లు ఉండాలి. అయితే తుది జాబితాల్లో ఉన్న వారు 52.78 కోట్లు.
అంటే ఈ రెండింటి మధ్య తేడా అదే తొలగించిన ఓట్లు 73 లక్షలు. అయితే కొన్ని సర్దుబాట్ల అనంతరం సుమారు 70 లక్షల మంది ఓటర్ల లోటు ఉన్నట్లు ఆయన పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. మరోవైపు, సర్ ప్రక్రియలో తొలగించిన పేర్లలో మరణించినవారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, ఒకటికంటే ఎక్కువ చోట్ల నమోదైనవారు, ఆచూకీ లభించనివారు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
అయితే, ఆచూకీ లభించకపోవడం ఒక్కటే ఒక వ్యక్తి ఓటు హక్కుకు అనర్హుడని నిరూపించదని అభిప్రాయ పడ్డారు. అయితే, 70 లక్షల మంది అర్హులైన ఓటర్ల పేర్లు ఎందుకు జాబితాల్లో కనిపించడం లేదన్నది కీలక ప్రశ్నగా మారింది. భల్లా అంచనా వేసిన ఈ సంఖ్యను నిర్ధారిత అక్రమ తొలగింపులుగా పరిగణించలేమని, ఇందుకు రాష్ట్రాలవారీగా ఓటరు రికార్డులు, తొలగింపుల కారణాలు, అప్పీళ్ల వివరాలను పరిశీలించాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నికల సంఘం నుంచి సమగ్ర వివరణ వెలువడితేనే ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.