అయోధ్య-జనక్‌పూర్ మధ్య రైలు ప్రారంభం
న్యూఢిల్లీ: భారత్–నేపాల్(India Nepal) మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను మరింత బలోపేతం చేసే కొత్త రైలు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య కంటోన్మెంట్ నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ వరకు నడిచే వారపు రైలు ‘సరయూ–కమల ఎక్స్‌ప్రెస్’(Saryu Kamala Express)ను ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బలేంద్ర షా(PM Balendra Shah) సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్, నేపాల్ మధ్య బంధం కేవలం పొరుగు దేశాల సంబంధం మాత్రమే కాదని, ఉమ్మడి సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. శ్రీరాముడు, సీతాదేవి రెండు దేశాల మధ్య ఉన్న నాగరికతా బంధానికి ప్రతీకలని అన్నారు.
కొత్త రైలు సర్వీసుతో అయోధ్య(Ayodhya)కు వచ్చే భక్తులు నేపాల్‌లోని జనక్‌పూర్‌కు సులభంగా చేరుకోవచ్చని తెలిపారు. దీంతో రామాయణానికి సంబంధించిన పుణ్యక్షేత్రాల సందర్శన మరింత సౌకర్యవంతం కానుంది. భక్తులతో పాటు సాధారణ ప్రయాణికులకు కూడా ఈ రైలు ఉపయోగపడనుంది. మరోవైపు నేపాల్‌లో ఇటీవల సంభవించిన వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి మోదీ సంతాపం తెలిపారు. నేపాల్ అభివృద్ధికి భారత్ తరఫున 24,000 కోట్ల నేపాలీ రూపాయల అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించినట్లు వెల్లడించారు. సరయూ–కమల ఎక్స్‌ప్రెస్ ప్రారంభంతో భారత్–నేపాల్ మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపు లభించనుంది.