మూడో బిడ్డను కంటే రూ.50 వేలు.. వైరల్ స్కీమ్!

25-09-2026 | 08:16am

జనాభా తగ్గుతోంది.. మూడో బిడ్డకు రూ.50 వేల FD!

మరోచోట 25 ఏళ్ల వరకు నెలకు రూ.5 వేలు

గాంధీనగర్: గుజరాత్‌లోని కొన్ని కమ్యూనిటీలు తమ జనాభా తగ్గుదలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తున్నాయి. కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతుండటంతో మూడో సంతానాన్ని ప్రోత్సహించేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కచ్చ్ కడ్వా పాటిదార్ సమాజ్(Kutch Kadva Patidar Samaj) దక్షిణ గుజరాత్ జోన్ తాజాగా ‘బాల ప్రోత్సాహక పథకం’ ప్రకటించింది. సమాజంలో మూడో సంతానం జన్మిస్తే.. ఆ బిడ్డ పేరు మీద రూ.50 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ (Third child 50000 FD) చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రయోజనం అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేకుండా వర్తిస్తుందని సమాజ ప్రతినిధులు తెలిపారు. మూడో బిడ్డకు జన్మనిచ్చిన దంపతులను బహిరంగ కార్యక్రమంలో సన్మానించనున్నట్లు కూడా పేర్కొన్నారు.

దక్షిణ గుజరాత్‌లో కచ్చ్ కడ్వా పాటిదార్ సమాజ్ జనాభా సుమారు 17 వేలుగా ఉందని, అది తగ్గుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సమాజ నాయకులు తెలిపారు. యువ దంపతుల్లో సంతానం సంఖ్య తగ్గుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోత్సాహకాన్ని తీసుకొచ్చినట్లు వారు వెల్లడించారు. ఇదే సమయంలో సూరత్ పార్సీ పంచాయత్(Surat Parsi Panchayat third child scheme) కూడా మూడో సంతానాన్ని ప్రోత్సహించే ఆర్థిక సహాయ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు మూడో బిడ్డకు నెలకు రూ.5,000 చొప్పున.. పిల్లలకు 25 ఏళ్లు వచ్చే వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు సమాచారం. కుటుంబ పరిమాణం తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని కమ్యూనిటీలు తమ భవిష్యత్ జనాభాపై దృష్టి సారించి ఇలాంటి ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వార్తలు