ఆర్ఎస్ఎస్ పనికి ప్రేమే ఆధారం
- ‘శుద్ధ సాత్విక ప్రేమ’ మా విధికి పునాది
- తమ సంస్థ ద్వేషంపై ఆధారపడిందన్న ఆరోపణలు అవాస్తవం
- భిన్నత్వంలో ఏకత్వం అనేదే హిందూ ఆలోచనా విధానం
- హిందువు ఒక స్వభావం.. అన్ని వైవిధ్యాలను అంగీకరించాలి
- ‘మీ విధేయత ఎక్కడ ఉంటుందో అదే మీ ‘కర్మభూమి’
- లండన్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
లండన్, సెప్టెంబర్ 7: ‘మా పనికి తీవ్రమైన ద్వేషం ప్రాతిపదిక అని కొందరు చెప్పడం విన్నాను. కానీ, అది పూర్తిగా అవాస్తవం. దానికి పూర్తి వ్యతిరేకం. స్వచ్ఛమైన, సాత్వికమైన ప్రేమే మా పనికి ఆధారం’ అని ఆర్ఎస్ఎస్(Rashtriya Swayamsevak Sangh) చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) అన్నారు. ‘అపనపన్’ అంటే అందరినీ సొంతవాళ్లుగా భావించే తత్వం హిందూ(Hindu) ఆలోచనా విధానంలో, ఆర్ఎస్ఎస్ పనితీరులో కేంద్రంగా ఉంటుందని వివరించారు. ఈ భావన వ్యక్తి నుంచి కుటుంబం, సమాజం(Society), మానవాళి వరకు విస్తరిస్తుందని, ప్రకృతితో హిందువులకు ఉన్న అనుబంధాన్ని కూడా ఇది తెలియజేస్తుందని స్పష్టం చేశారు.
ఆర్ఎస్ఎస్ తీవ్రమైన ద్వేషం పునాదిగా పనిచేస్తుందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తమ సంస్థ కార్యకలాపాలకు ‘శుద్ధ సాత్విక ప్రేమ’ మాత్రమే ఆధారమని, ఇదే తమ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఒక వ్యక్తి విధేయత అనేది వారి ‘కర్మభూమి’ (పనిచేసే ప్రదేశం) పట్ల ఉంటుందని, బ్రిటిష్ హిందువుల(British Hindus) విషయంలో ఆ కర్మభూమి యూకేనే అని హిందుత్వ స్పష్టం చేస్తోందని మోహన్ భగవత్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో లండన్లో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం జరిగిన ‘సెలబ్రేషన్ ఆఫ్ వన్నెస్’ (ఏకత్వ వేడుక) అనే చర్చా కార్యక్రమంలో భగవత్ ప్రసంగించారు.
ప్రస్తుత ప్రపంచం ఎదు ర్కొంటున్న ఘర్షణలు, పర్యావరణ(Environmental), ఆర్థిక సవాళ్లకు(Financial challenges) హిందూ జీవన విధానం ఎలాంటి పరిష్కారం చూపగలదన్న ప్రశ్నకు భగవత్ బదులి చ్చారు. ప్రపంచం విభిన్నంగా కనిపించినా, దాని మూలమంతా ఒకటేనని హిందూ ధర్మం చెబుతుందన్నారు. ఈ వైవిధ్యాలు సహజమైనవి, వాటిని గౌరవించాలి. అయితే, ఈ భిన్నత్వాన్ని చూస్తూనే దాని వెనుక ఉన్న ఏకత్వాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘నేను గెలవాలి, అవతలి వారు ఓడిపోవాలి’ అనే ధోరణి కాకుండా, ఇద్దరి అవసరాలు తీరాలనే ఆలోచనతో ఉంటే ఘర్షణలకు తావుండదు’ అని ఆయన విశ్లేషించారు.
మానవ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఒకదానికొకటి వ్యతిరేకం కాకూడదని, అవి పరస్పరం పూరకాలుగా ఉండాలని భగవత్ అభిప్రాయపడ్డారు. ‘మనం ప్రకృతిలో భాగం. కాబట్టి మన అభివృద్ధి ప్రకృతి అభివృద్ధికి కూడా దోహదపడాలి. ‘గ్రీన్ సొల్యూషన్స్’ అనే భావన ఈ సమతుల్యతనే ప్రతిబింబిస్తుంది. జీవించు, జీవించనివ్వు అనే సూత్రంతో పాటు ఇతరులు జీవించేలా చేయాలన్నదే మన ఆలోచనా విధానం. ఈ సమతుల్యతను హిందువులు ప్రపంచానికి అందించాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
‘మీ విధేయత ఎక్కడ ఉంటుందో అదే మీ ‘కర్మభూమి’
‘హిందుత్వ’ అనే పదంపై ఉన్న అపోహలను తొలగించేలా దానిని నిర్వచించమని కూడా ఆయనను కోరారు. హిందూ సమాజానికి తమ జన్మభూమి (పుట్టిన దేశం), కర్మభూమి (పనిచేసే దేశం) మధ్య విధేయత విషయంలో విభజన ఏర్పడుతుందనే ఆందోళనపై అడిగిన ప్రశ్నకు భగవత్ స్పందించారు. ‘వాస్తవానికి, ఇందులో ఎలాంటి సంఘర్షణ లేదన్నారు. బ్రిటిష్ హిందువులు గనుక ‘అచ్చా, పుక్కా, సచ్చా’ (మంచి, దృఢమైన, నిజాయితీ గల) హిందువులైతే, బ్రిటన్, భారత్ ప్రయోజనాల మధ్య ఎప్పటికీ ఎటువంటి సంఘర్షణ ఉండదు’ అని స్పష్టం చేశారు.
‘ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే, బ్రిటన్లోని హిందువులు బ్రిటన్ పక్షానే నిలుస్తారన్నది సుస్పష్టమన్నారు. ‘మీ విధేయత ఎక్కడ ఉంటుం దో అదే మీ ‘కర్మభూమి’. మీ ’జన్మభూమి’ మీకు జీవన విలువలను అందిస్తుంది. ఆ విలువల ఆధారంగానే మీరు మీ కర్మభూమికి సేవ చేస్తూ జీవిస్తారు. కాబట్టి, మీ కర్మభూమికి ద్రోహం చేయమని హిందుత్వం ఎప్పుడూ చెప్పదు’ అని ఆయన అన్నారు.
అన్ని వైవిధ్యాలను అంగీకరించాలి
‘హిందువు’ అనే పదాన్ని కేవలం ఏదైనా మతపరమైన ఆచరణ లేదా జీవనశైలి ఆధారంగా అర్థం చేసుకోలేమని భాగవత్ అన్నారు. ‘హిందు వు అనేది ఒక స్వభావమని, అటువంటి స్వభావం కలిగిన సమాజం అన్ని వైవిధ్యాలను అంగీకరించి గౌరవించాలన్నారు. ఎందుకంటే అన్ని మార్గాలు ఒకే లక్ష్యానికి దారితీస్తాయని అది విశ్వసిస్తుందని తెలిపారు. ‘భూమిపై పడే నీరంతా చివరికి సముద్రంలో ఎలా కలుస్తుందో, అలాగే వైవిధ్యం సహజం కాబట్టి మార్గాలు కూడా భిన్నంగా ఉండటం సహజం. మనమందరం ఒకేలా (ఏకరూపంగా) ఉండాల్సిన అవస రం లేదు. ఐక్యతకు ఏకరూపత అవసరం లేదు.
వైవిధ్యంలోనే ఐక్యత ఉంటుంది’ అని స్పష్టం చేశారు. అలాగే, ‘సేవ’ ప్రాతిపదికన పనిచేసే సంస్థగా ఆర్ఎస్ఎస్ గురించి వివరించిన భాగవత్, ఈ సూత్రం ద్వారా మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడంలో భవిష్యత్ తరాలు పోషించబో యే పాత్రపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన హిందుత్వాన్ని ‘ఏకత్వ భావన’గా నిర్వచించారు. హెచ్ఎస్ఎస్ యూకే ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూకే వ్యాప్తంగా 310కి పైగా హిందూ సంఘాలు, సంస్థలు మద్దతు తెలిపాయి. మొత్తం మీద ఆర్ఎస్ఎస్ సిద్ధాంతా లను అంతర్జాతీయ వేదికపై స్పష్టం చేస్తూ, హిందూ జీవన విధానం ప్రాముఖ్యతను భగవత్ తన ప్రసంగం ద్వారా వివరించారు.