క్రిస్మస్ ప్రార్థనల్లో ప్రధాని మోదీ
25-12-2025
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్లో(Cathedral Church of The Redemption) క్రైస్తవులతో కలిసి క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో ప్రార్థనలు, క్రిస్మస్ గీతాలు, భక్తిగీతాలు, ఢిల్లీ బిషప్ అయిన రైట్ రెవరెండ్ డాక్టర్ పాల్ స్వరూప్ చేత ప్రధానమంత్రి కోసం ప్రత్యేక ప్రార్థన జరిగాయి. "ఢిల్లీలోని ది కేథడ్రల్ చర్చి ఆఫ్ ది రిడంప్షన్లో క్రిస్మస్ ఉదయం సేవకు హాజరయ్యారు. ఈ సేవ ప్రేమ, శాంతి, కరుణ కాలాతీత సందేశాన్ని ప్రతిబింబిస్తుంది. క్రిస్మస్ స్ఫూర్తి మన సమాజంలో సామరస్యం, సద్భావనను ప్రేరేపిస్తుంది" అని మోడీ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. అంతకుముందు, ప్రధానమంత్రి క్రిస్మస్ సందర్భంగా పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. "ప్రతి ఒక్కరికీ శాంతి, కరుణ, ఆశతో నిండిన ఆనందకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు బోధనలు మన సమాజంలో సామరస్యాన్ని బలోపేతం చేస్తాయి" అని ఆయన మరొక పోస్ట్లో పేర్కొన్నారు.