ప్రధాన రహదారిపై మృత్యు గుంత.. పట్టించుకోని అధికారులు!

19-09-2026 | 03:24pm

జనగామ సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): జనగామ జిల్లా, నర్మెట మండలం, హనుమంతపూర్ - దొడ్లగడ్డ తండా (Hanumanthapur - Dodlagadda Thanda) వద్ద  జనగామ - హుస్నాబాద్ ప్రధాన రహదారిపై హనుమంతపూర్, దొడ్లగడ్డ తండా వద్ద రోడ్డు మధ్యలో భారీ గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. రోజురోజుకూ ఆ గుంత పెద్దదవుతుండటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆ గుంత కనిపించక ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు కూడా అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది. ఇది ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. స్కూల్ పిల్లలు, రైతులు ఈ దారిలోనే ప్రయాణిస్తున్నారు. ఏ క్షణంలో పెద్ద ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కావున సంబంధిత R&B శాఖ అధికారులు వెంటనే స్పందించి, ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే ఆ గుంతను పూడ్చి, రోడ్డుకు మరమ్మతులు చేయాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు