అక్రమార్కుల ఇష్టారాజ్యం!?
- పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు
- అనుమతి గోరంత.. కట్టడాలు కొండంత
- చూసీ చూడనట్టు అధికారుల వ్యవహారం
- అనుమతి ఒకటి నిర్మాణం మరొకటి
బాన్సువాడ, ఆగస్టు 19 (విజయ క్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో అక్రమ నిర్మాణాల వ్యవహారం రోజురోజుకీ తీవ్ర రూపందాల్చుతోంది. నిబంధనలు ఉన్నా అమలు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, కొందరి పెద్దల ప్రభావం, మరికొందరి చేయి తడిపితే చాలు అనే ఆరోపణలతో మొత్తం అనియంత్రిత నిర్మాణాలతో నిండిపోతోందనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
పట్టణ ప్రాంతాల్లో అనేక వార్డుల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగుతుండగా, మరికొన్ని చోట్ల నివాస గృహం పేరుతో అనుమతి తీసుకుని, అదే ప్రాంగణంలో బహుళ అంతస్తుల వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు, నిర్మిస్తున్న ఘటనలు బయటపడుతున్నాయి.
రెండు అంతస్తుల అనుమతి తీసుకుని నాలుగు నుంచి ఐదు అంతస్తులు నిర్మించడం సాధారణంగా మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్ శాఖ నిబంధనలు ఉల్లంఘించడం అటువైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అధికారులు మౌనం ఎందుకు ఉంటున్నారని మౌనం వెనుక అసలు కారణాలు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బాన్సువాడ మున్సిపల్‌లో ఇదే తంతు..
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో అనుమతులు ఒకటైతే నిర్మాణాలు మరొక తిరు ఉంది. పట్టణంలోని పలు కాలనీలు జెండా గల్లీ, సాయికృపా నగర్, బొర్లం రోడ్ లో బహిరంగ ఉల్లంఘనలు చేస్తూ గృహ నిర్మాణానికి అనుమతి తీసుకుని,విద్యాసంస్థ కోసం నాలుగు అంతస్తుల భవనం నిర్మిస్తున్న ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అదేవిధంగా బహిరంగంగా నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగావ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇది నిర్లక్ష్యమా? లేక దీని వెనుక ఏదైనా మతలబు ఉందా? అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చలు చర్చోప చర్చలుగా సాగుతున్నాయి. లేఅవుట్ క్లియరెన్స్ లేకుండానే ఇళ్లకు అనుమతులు ఇస్తూ కొన్ని ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లకు ఇంకా ఫైనల్ క్లియరెన్స్ లేకపోయినా, అక్కడ ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు జారీ కావడం అనుమానాస్పదంగా మారింది.నియమాల ప్రకారం ముందుగా లేఅవుట్కు పూర్తి అనుమతి రావాలి.
ఆ తర్వాతే వ్యక్తిగత ప్లాట్లపై ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలి. కానీ ఈ ప్రక్రియను పక్కనబెట్టి నేరుగా అనుమతులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై అధికారుల విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మున్సిపల్ చట్టం ఏమి చెబుతుంది...?
తెలంగాణ మున్సిపల్ చట్టం, 2019 ప్రకారం అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టడం చట్ట విరుద్ధం. అనుమతికి విరుద్ధంగా నిర్మాణం చేస్తే పనులను వెంటనే నిలిపివేయాలి. అవసరమైతే అక్రమనిర్మాణాలను కూల్చివేయాలి కమర్షియల్ లేదా విద్యాసంస్థ నిర్మాణాలకు ప్రత్యేక అనుమతులు తప్పనిసరి.లేఅవుట్ క్లియరెన్స్ లేకుండా నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదు ఇన్ని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ అవి అమలు కావడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నా యి.
అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపెనా.?
ఉమ్మడి నిజాంబాద్ జిల్లాలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి అధికారులు ఉక్కు పాదం మోపుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.
ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం
అక్రమ నిర్మాణాల జోరు పై మున్సిపల్ కమిషనర్ గంగాధర్ ను విజయక్రాంతి ప్రతినిధి వివరణ కోరగా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. అక్రమ నిర్మాణాలు జరగడంలేదని చెప్పడం గమనార్వం.
- గంగాధర్, మున్సిపల్ కమిషనర్, బాన్సువాడ






