కొనుగోళ్లకు పక్కా ప్లాన్
- రూ.18,250 కోట్లతో 65 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
- రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలు
- రైతులకు చెల్లింపుల్లో జాప్యం ఉండదు
- ఏడు సన్న రకాలకు బోనస్
- డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులను జప్తు చేయండి
- అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : వానాకాలం ధాన్యం కొనుగోళ్ల(Grain procurement,)కు పకడ్బందీ ప్రణాళిక అమలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఆదేశించారు. రూ.18,250 కోట్ల అంచనా విలు వతో 65 లక్షల టన్నులు ధాన్యం(grain) సేకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొనుగోలు కేంద్రాల(Purchasing centers) వద్ద రైతులు(farmers) నిరీక్షించాల్సిన పరిస్థితి రాకూడదని, నగదు చెల్లిం పుల్లోనూ జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు.
వానాకాలం ధాన్యం కొనుగోళ్లు, కస్టం మిల్లింగ్ రైస్(custom milling rice) (సీఎంఆర్) బకాయిలపై అదనపు కలెక్టర్లు(additional collectors), జిల్లా పౌర సరఫరాలు(district civil supplies), ఇతర ఉన్నతాధికారులతో శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వానాకాలం ధాన్యం సేకరణకు రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వీటిలో ఐకేపీ 3,180, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 4,372, మరో 731 ఇతర కొనుగోలు కేంద్రాలు ఉంటాయని వివరించారు. అక్టోబర్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్టోబర్ 1 నాటికే అన్ని కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
కేంద్రం గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 కనీస మద్దతు ధరగా నిర్ణయించిందని తెలిపారు. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఏడు ప్రాధా న్య సన్న రకాల ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు చెప్పా రు. బీపీటీ- 5204, ఆర్‌ఎన్‌ఆర్- 15048, కేఎన్‌ఎం-1638, జై శ్రీరామ్, హెచ్‌ఎంటీ-సోనా, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌ఎం-7715 రకాలకు ఈ బోనస్ వర్తిస్తుందని వెల్లడించారు.
ఈ ఏడు రకాలను ఏకపక్షంగా ఎంపిక చేయలేదని, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న డిమాండ్‌ను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన అనంతరమే మెరుగైన ధర లభించే అవకాశమున్న రకాలను గుర్తించామని వివరించారు. అదే విధంగా సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులు జప్తు చేయడంతో పాటు 2014 నుంచి సమగ్ర భౌతిక ఆడిట్ నిర్వహించాలని సూచించారు.
బియ్యం ఎగుమతులకు దీర్ఘకాలిక వ్యూహం..
రైతుకు గిట్టుబాటు ధర లభించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణ బియ్యానికి దేశీయ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయ స్థాయిలోనూ స్థిరమైన ఎగుమతి మారెట్‌ను అభివృద్ధి చేసేందుకు దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు.తెలంగాణ బియ్యం ఎగుమతులను ప్రోత్సహించి, అంతర్జాతీయ మార్కెట్లో స్థిరమైన డిమాండ్‌ను సృష్టించగలిగితే రాష్ట్ర రైతులకు మెరుగైన ధర లభించడంతోపాటు ధరల వ్యత్యాసం కారణంగా ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని కూడా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.
యాసంగి వేసవి పంట కావడంతో గతంలో వానాకాలంతో పోలిస్తే యాసంగి ధాన్యం దిగుబడి తక్కువగా ఉండేదన్నారు. ప్రస్తుతం యాసంగి ధాన్యం ఉత్పత్తి వానాకాలం స్థాయికి చేరుకోవడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో దానిని అధిగమించడం తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న సానుకూల పరిణామమని పేర్కొన్నారు. ప్రస్తుత వానాకాలంలో 57.70 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, 119.57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిపారు.
ఇందులో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా 45 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, 20 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం కలిపి మొత్తం 65 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ధాన్యం రాక గరిష్ఠ స్థాయికి చేరుతుందని తెలిపారు. నవంబర్‌లో 24.72 లక్షల మెట్రిక్ టన్నులు, డిసెంబర్లో 25.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు.
ప్రతి జిల్లా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలి..
ధాన్యం సేకరణకు ప్రతి జిల్లా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపు నిలిచిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ఈ సీజన్‌కు 16.25 కోట్ల గన్నీ సంచులు అవసరం కాగా, 3.50 కోట్ల సంచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మిగిలిన సంచుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్‌ను తప్పనిసరిగా అమలు చేయడంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి అనధికారికంగా ధాన్యం రాకుండా సరిహద్దు తనిఖీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ‘ధాన్యం కొనుగోలు యంత్రాంగం అంతా రైతు ప్రయోజనాల పరిరక్షణే పరమావధిగా పనిచేయాలి. కొనుగోలు కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయాలి. రైతుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి.
తూకం, నాణ్యత పరీక్షల్లో పూర్తి పారదర్శకత పాటించాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తూ, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలి’ అని మంత్రి స్పష్టం చేశారు. ‘రూ.18,250 కోట్ల విలువైన 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ప్రతి స్థాయిలోనూ సూక్ష్మ ప్రణాళిక అవసరం.
రైతుకు సరైన ధర లభించాలి. చెల్లింపులు సకాలంలో జరగాలి. ఏ దశలోనూ రైతుకు అసౌకర్యం కలగకూడదు’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సంచాలకుడు శ్యామ్ ప్రసాద్, అదనపు సంచాలకుడు రోహిత్ సింగ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






