ఏసీబీకి చిక్కిన కీసర ఖాకీలు

18-09-2026 | 05:20am
  1. గణేష్ నిమజ్జనం డ్యూటీలో ఉన్నప్పుడే ౫ లక్షలు లంచం స్వీకరించిన వైనం
  2. కీసర పోలీస్‌స్టేషన్, సీఐ, ఎస్సై ఇళ్లలో ఏసీబీ సోదాలు
  3. చేవెళ్లలోనూ లంచగొండులు

మేడ్చల్/చేవెళ్ల, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 5 లక్షలు లంచం తీసుకుంటూ మేడ్చల్ జిల్లా కీసర సీఐ ఆంజనేయులు(Medchal District Keesara CI Anjaneyulu), ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి(SI Gyanender Reddy) ఏసీబీకి చిక్కారు. కీసరలో ఒక వ్యక్తి రేషన్ బియ్యం తరలిస్తుండగా, పట్టుకుని కేసు నమోదు చేశారు. స్టేషన్ బెయిల్ ఇవ్వాలన్న, దందా సాఫీగా సాగాలన్న తమకు రూ.పది లక్షలు ఇవ్వాలని కీసర సీఐ ఆంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అంతేగాక బిర్యానీలు, మందు బాటిళ్లు తీసుకురావాలని వేధించారు.

రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్న బాధితుడు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం అర్ధరాత్రి రాంపూర్ చెరువు వద్ద కారులో ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి బాధితుడి నుంచి రూ.ఐదు లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను గమనించిన ఎస్సై అక్కడి నుంచి పరుగులు తీసినట్టు తెలిసింది. గణేష్ నిమజ్జనం డ్యూటీలో ఉన్న సమయంలోనే ఎస్సై లంచం స్వీకరించారు. సీఐ కూడా అక్కడే నిమజ్జనం విధుల్లో ఉన్నారు.

దీంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కీసర పోలీస్ స్టేషన్‌లో సోదాలు చేశారు. హైదరాబాదులో సీఐ, ఎసైస ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు జరిగాయి. సీఐ ఆంజనేయులు సూచన మేరకే ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డి లంచం స్వీకరించినందున ఇద్దరిపై కేసు నమోదు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచామని అధికారులు తెలిపారు. కీసర సీఐ ఏసీబీకి దొరకడంతో ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వచ్చి టపాకాయలు పేల్చి సంబురాలు చేసుకున్నారు. 

చేవెళ్లలో పట్టుబడ్డ అధికారులు..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి నుంచి రూ.2.50 లక్షలు డిమాండ్ చేసిన ఎస్టీవో ఎం లక్ష్మణ్, అసిస్టెంట్ ఎస్టీవో కే అనురాధ, ఆమె పీఏ అంజయ్య ఏసీబీకి పట్టుబడ్డారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా గురువారం చేవెళ్ల ఎస్టీవో కార్యాలయంలో దాడులు నిర్వహించారు. బాధితుడి నుంచి ఎస్టీవో లక్ష్మణ్ రూ.లక్ష, అసిస్టెంట్ ఎస్టీవో అనురాధ రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అలాగే అనురాధ పీఏ జంగయ్య అలియాస్ చిన్న అనే వ్యక్తి ద్వారా రూ.50 వేలు తీసుకోవడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 

 

మరిన్ని వార్తలు