బెల్లంపల్లిని సందర్శించిన అదనపు కలెక్టర్
బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మండలంలోని గణేష్ నిమజ్జన ప్రాంతాలను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య(District Additional Collector Chandraiah) సందర్శించి భక్తులు, ప్రజలకు కల్పించిన మౌలిక సదుపాయాలను బుధవారం పరిశీలించారు. నిమజ్జన ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడింగ్, లైటింగ్, త్రాగునీరు, భద్రతా ఏర్పాట్లు, తదితర సౌకర్యాలను పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పని చేయాలని, నిమజ్జన ప్రాంతాల వద్ద అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచాలన్నారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. అనంతరం సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, విద్యా బోధన తీరు, మధ్యాహ్న భోజన నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్య బోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పరిశీలించారు. మ్యాపింగ్ కాని, అనమలిస్ జాబితాలో ఓటర్లకు సంబంధించి సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.