పెద్దలకూ వ్యాక్సిన్లు అవసరం
మీడియా సమక్షంలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న మెడికవర్ హాస్పిటల్ వైద్యులు
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): వ్యాక్సినేషన్ (Vaccination) చిన్నారులతోనే ఆగిపోకూడదని, పెద్దలు కూడా తమ వయసు, ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా వ్యాక్సిన్లు తీసుకోవాలని మెడికవర్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ వైద్యులు సూచించారు. పెద్దల్లో వ్యాక్సినేష్ప అవగాహన కల్పించేందుకు ఆసుపత్రి అడల్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీనియర్ వైద్యులు మీడియా సమక్షంలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుని పెద్దలకు వ్యాక్సినేషన్ ప్రాధాన్యతను చాటిచెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అడల్ట్ ఇమ్యునైజేషన్ కార్డును కూడా ప్రారంభించారు. చిన్నతనంలో వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత పెద్దయ్యాక కూడా వ్యాక్సినేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉంది. చాలామంది తమకు ఏ వ్యాక్సిన్లు అవసరమో, చివరిసారిగా ఎప్పుడు తీసుకున్నారో కూడా గుర్తుంచుకోరు. వ్యాక్సినేషన్ను సాధారణ ఆరోగ్య సంరక్షణలో భాగంగా మార్చడమే మా లక్ష్యం, అని డా. ప్రదీప్ కుమార్ మిశ్రా, జనరల్ మెడిసిన్ తెలిపారు.
వృద్ధులు, ఆస్తమా, సీవోపీడీ, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఫ్లూ, న్యూమోకోకల్ వ్యాక్సిన్లపై వైద్యుల సలహా తీసుకోవాలని వైద్యులు సూచించారు. వృద్ధులు తమకు అవసరమైన వ్యాక్సిన్లపై వైద్యులను సంప్రదించాలి, అని డా. గంగాధర్ రెడ్డి మల్లు, పల్మనాలజిస్ట్ తెలిపారు. నవజాత శిశువుల తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మలు, ఇతర సంరక్షకులు కూడా తమ వ్యాక్సినేషన్ స్థితిని తెలుసుకోవాలని వైద్యులు సూచించారు.
వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా ఇంట్లోకి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు, అని డా. వినయ్ కుమార్ రతన్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్ తెలిపారు. అడల్ట్ వ్యాక్సినేషన్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాధాన్యతను కూడా వైద్యులు వివరించారు. గర్భిణీలు టీడ్యాప్ వంటి వ్యాక్సిన్లపై కూడా తమ వైద్యుల సలహా తీసుకోవాలని డా. వాలూరి పద్మిని గైనకాలజిస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నెప్రాలజిస్ట్ డా. రాజీవ్, సెంటర్ హెడ్ కృష్ణవేణి, మెడికల్ సూపరింటెండెంట్ డా ప్రశాంత్ పాల్గొన్నారు.