పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

05-10-2026 | 08:01pm

వేతన పెంపు హామీని తక్షణమే అమలు చేయాలి

రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు ఇవ్వాలి

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్(AITUC State Secretary Narati Prasad) డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు గత ఏడాది కాలంగా అద్దెలు, గ్యాస్ ఛార్జీలు, ఆరోగ్యలక్ష్మి నిధులు, ఈవెంట్ బిల్లులు పేరుకుపోయి కేంద్రాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సొంత నిధులతో కేంద్రాలను నడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా నెలకు రూ.18 వేల వేతన పెంపును వెంటనే అమలు చేయాలని, దసరా పండుగ సెలవులు మంజూరు చేయడంతో పాటు పదవీ విరమణ పొందే ఉద్యోగులకు గౌరవప్రదమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ, సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు వేల్పుల మల్లికార్జున్, భూక్యా శ్రీనివాస్, గోనే మణి, రెడ్డి అరుణ, భూక్యా లలిత, విజయ, భారతి, సంధ్య, ప్రమీల, చిన్నారి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు