30 August, 2026 | 5:01 AM

‘శుద్ధి’పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి

30-08-2026 01:31 AM
  1. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి
  2. ఖర్గేకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం
  3. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం అంటరానితనం అమలు 
  4. మీడియా సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్

డెహ్రాడూన్, ఆగస్టు ౨౯: ‘ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల ౮న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో పర్యటించారు. అక్కడి రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ఓ బహిరంగ సభకు హాజరయ్యారు. ఆయన పర్యటన తర్వాత కొందరు స్థానికులు మైదానం సమీపంలోని రామాలయాన్ని శుద్ధి చేశారు. ఖర్గే ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారని తెలిసే ఈ శుద్ధీకరణ జరిగింది.

అంటరానితనం అమలులో భాగంగానే కులోన్మాదులు శుద్ధీకరణకు పూనుకున్నారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి’ అని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడికే ఈ పరిస్థితి ఎదురైతే, ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమది రాజ్యాంగ పరిరక్షణకు, ఆర్‌ఎస్‌ఎస్- బీజేపీ భావజాలానికి మధ్య జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు.

ప్రధాని మోదీ సబ్బండ కులాలు సమానమని ప్రచారం చేస్తుంటే, ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ మాత్రం శుద్ధీకరణను సమర్థించడం శోచనీయమన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మానసిక స్థితికి శుద్ధీకరణ చర్య ప్రతిబింబమంటూ మండిపడ్డారు. ఎస్సీలు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు ఇష్టం లేదని అభిప్రాయపడ్డారు. శుద్ధీకరణ జరిగి ౨౦ రోజులు గడిచినా, హల్దానీ పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం విస్మయం వ్యక్తం చేశారు. 

మల్లికార్జున ఖర్గేకు న్యాయం జరిగే వరకు పోరాటం

హల్దానీలో శుద్ధీకరణ చర్య ఒక్క ఖర్గేకే పరిమితం కాలేదని, కేంద్ర మంత్రి జితిన్‌రాం మాంఝీ అదే ఆలయాన్ని సందర్శించిన తర్వాతా శుద్ధీకరణ జరిగిందని గుర్తుచేశారు. ఇప్పటికైనీ కేంద్రంతో పాటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించి ఖర్గేకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఖర్గేకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.

ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం కారణంగా దేశంలో అంటరానితనం పెచ్చరిల్లుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఇప్పటికీ ఎస్సీ వర్గాలకు చెందిన పిల్లలతో మరుగుదొడ్లు శుభ్రం చేయించడం వంటి అమానుషాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల్లోనైతే కనీసం ఆ సామాజికవర్గాలకు చెందిన వారికి తాగునీరు కూడా దొరకని పరిస్థితి దాపురించిందని విస్మయం వ్యక్తం చేశారు.