గరిడేపల్లి బస్టాండ్‌కు వసతులు కల్పించాలి
ఇరువై ఆరూ సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోని బస్టాండ్
బస్టాండ్ చుట్టూ అపరిశుభ్రత అసాంఘిక కార్యక్రమాలు
ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో నిరసన
గరిడేపల్లి,(విజయకాంతి): గరిడేపల్లి మండల(Garidepalli Mandal) కేంద్రంలోని బస్టాండ్‌కు తక్షణమే మౌలిక వసతులు కల్పించి, ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని ఎం.ఆర్.పి.ఎస్, బిఆర్ఎస్, ఏఐటియుసి, ఎంఎస్పి వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బస్టాండ్ ఎదుట నిరసన చేపట్టి అనంతరం ఎంపీడీవో ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ..2000లో ప్రజల నిధులతో నిర్మించిన బస్టాండ్ 26 ఏళ్లుగా సరైన మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థకు చేరిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పైకప్పు పెచ్చులు ఊడిపడే ప్రమాదం ఉందని, బస్సులు వచ్చే మార్గం బురదమయంగా ఉందని తెలిపారు. టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, కుర్చీలు, ఎంక్వయిరీ కౌంటర్, సీసీ కెమెరాలు వంటి కనీస సౌకర్యాలు లేవని పేర్కొన్నారు.
బస్టాండ్ చుట్టూ అపరిశుభ్రత, చెత్తాచెదారం, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.ప్రజల సౌకర్యార్థం ప్రస్తుతం పోలీస్‌స్టేషన్ ఉన్న స్థలంలో నూతన బస్టాండ్ నిర్మించాలని, అవసరమైతే ప్రస్తుత బస్టాండ్ స్థలంలో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని వారు సూచించారు. ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి రవి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, ఏఐటియుసి మండల అధ్యక్షుడు బెజ్జం రమేష్,బిఆర్ఎస్ నాయకులు ప్రధాని సైదులు, శంబిరెడ్డి,నకిరేకంటి రవి,షేక్ మన్సూర్ అలీ, పెండెం ధనయ్య గౌడ్, పెండెం వినోద్ తదితరులు పాల్గొన్నారు.
