గట్టెక్కిన ఏపీ హెచ్‌ఎంఈఎల్
- లాభాల బాటలోకి కంపెనీ
- మూడేళ్లలో రూ.34.20 కోట్ల నికర లాభం
హైదరాబాద్, సెప్టెంబరు 20 (విజయక్రాంతి): ఒకప్పుడు మూసివేత అంచులకు చేరిన ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్(Andhra Pradesh Heavy Machinery and Engineering Limited) (ఏపీహెచ్‌ఎంఈఎల్) ఇప్పుడు లాభాల బాటలో దూసుకెళ్తోంది. సింగరేణి(Singareni) అనుబంధ సంస్థగా మారిన తర్వాత సంస్థ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. గత మూడేళ్లలో ఏకంగా రూ.34.20 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2023--24లో రూ.1.05 కోట్లు, 2024--25లో రూ.9.87 కోట్లు, 2025--26లో రికార్డు స్థాయిలో రూ.23.33 కోట్ల నికర లాభం నమోదు చేసింది.
1998--99లో సింగరేణి ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు సంస్థ సంచిత లాభాలు రూ.60.85 కోట్లకు చేరాయి. సింగరేణి నిర్వహణ, కొత్త ఆర్డర్ల సాధన, వ్యయ నియంత్రణ, ఉత్పత్తుల్లో వైవిధ్యం వంటి చర్యలు సంస్థను బలోపేతం చేశాయి. గతంలో సింగరేణికే ప్రధానంగా యంత్రాలు, విడిభాగాలు సరఫరా చేసిన ఏపీఎచ్‌ఎంఈఎల్ ప్రస్తుతం బీహెచ్‌ఈఎల్, జెన్కో, ఎన్‌ఎండీసీ, ఆర్‌ఐఎన్‌ఎల్(BHEL, GENCO, NMDC, RINL) వంటి సంస్థలకు కూడా సరఫరాలు చేస్తోంది. సంస్థను జాతీయస్థాయి సంస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ప్రత్యేక దృష్టి సారించారు.
ప్లాంట్‌లో 300 కిలోవాట్ల సోలార్ ప్లాంట్(Solar plant) ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల నెలకు సుమారు రూ.2 లక్షల వరకు విద్యుత్ వ్యయం తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 1976లో కొండపల్లిలో ప్రారంభమైన ఏపీఎచ్‌ఎంఈఎల్ ఒక దశలో రూ.21 కోట్ల నష్టాల్లోకి వెళ్లి మూసివేత అంచులకు చేరింది. సింగరేణి పెట్టుబడులు, నిర్వహణ జోక్యంతో సంస్థ పునరుజ్జీవనం పొందింది. ఇప్పుడు జాతీయ మార్కెట్లో విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది.