కాంట్రాక్ట్ కార్మికుల బకాయిలు చెల్లించాలి
ఇల్లందు/టేకులపల్లి, (విజయక్రాంతి): సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్, వేతనం, బోనస్ బకాయిలను వెంటనే చెల్లించాలని సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ లేబర్(Singareni Coal Mines Contract and Outsourced Labor) ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah), ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్యలకు వినతిపత్రాలు అందజేశారు.
టేకులపల్లి మండలం కేఓసీ పిట్-1లో ఎల్‌ఎస్‌ఎన్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 350 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని యూనియన్ నాయకులు తెలిపారు. 2025 జూన్ నుంచి 2026 ఆగస్టు వరకు 15 నెలల ఈపీఎఫ్‌తో పాటు ఆగస్టు నెల వేతనం, బోనస్ చెల్లించాల్సి ఉన్నా ఇప్పటివరకు చెల్లించలేదని పేర్కొన్నారు.
కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కోరం కనకయ్య హామీ ఇచ్చారు. అనంతరం జీఎం ఈసం కృష్ణయ్యను కలిసి వినతిపత్రం అందజేయగా, సమస్యను పరిశీలించి ఈపీఎఫ్, వేతనం, బోనస్ చెల్లించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముచ్చ సుధాకర్, యూనియన్ ఇల్లందు అధ్యక్షుడు గోచికొండ సత్యనారాయణ, కాంగ్రెస్ జిల్లా నాయకుడు కోరం సురేందర్, తాటి శ్రీధర్, అంబాల చంద్రమౌళి, బానోత్ సైదులు, హలావత్ రఘురాం, పైడి రాజు తదితరులు పాల్గొన్నారు.