బీఆర్ఎస్ ధర్నాతో జూరాల వద్ద హైటెన్షన్
హైదరాబాద్: జూరాల ప్రాజెక్టు(Jurala Project) పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల ఆందోళనలకు మద్దతుగా ప్రాజెక్టు వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ(BRS Party) పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు.డ్యాం పరిసరాల్లో సుమారు 12కిలోమీటర్ల దూరం నుంచే పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. రహదారులపై అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేసి, పోలీసు వాహనాలను అడ్డంగా ఉంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు–గద్వాల రహదారిపై రాకపోకలను నిలిపివేశారు.
ధర్నాకు ముందే పలువురు బీఆర్ఎస్ మండల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. నందిమల్ల క్రాస్‌రోడ్ వద్ద మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్టును బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రహదారిపై కట్టెలు, రాళ్లు పేర్చి పోలీసు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసు వాహనానికి అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు.దీంతో జూరాల ప్రాజెక్టు పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.