తెలుగువాళ్లకు సినిమా ప్రాథమిక అవసరం!

03-10-2026 | 05:10am

న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్(Baa Baa Black Sheep)’. చిత్రాలయం స్టూడియో బ్యానర్‌పై వేణు దోనేపూడి(Venu Donepudi) నిర్మిస్తున్న ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయె, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, కార్తికేయ, విస్మయశ్రీ, మాల్వీ మల్హోత్రా, కశ్యప్, శుభలేఖ సుధాకర్, రాజారవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 9న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ నటుడు ఉపేంద్ర లిమాయె మాట్లాడుతూ.. “ముందుగా నా ప్రాణస్నేహితుడు సందీప్‌రెడ్డి వంగాకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నన్ను నా సొంత వాయిస్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. ఆయన చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. నేను ఎక్కడికెళ్లినా తెలుగు ప్రేక్షకులు నాపై కురిపించిన ప్రేమాభిమానాలు మర్చిపోలేను. ‘బా బా బ్లాక్ షీప్’ కథ నాకు చాలా విభిన్నంగా అనిపించింది. నేను నా పాత్ర కంటే కథకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. తెలుగులో ఇది నా మొదటి పూర్తిస్థాయి పాత్ర.

అందుకే ఈ సినిమా హృదయానికి ఎంతో దగ్గరైంది. సాధారణంగా సమాజంలో కూడు, గూడు, గుడ్డ ప్రాథమిక అవసరాలుగా భావిస్తారు.. కానీ దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు వారికి సినిమా కూడా ఒక ప్రాథమిక అవసరం. అంతటి సినిమా ప్రేమికులంతా థియేటర్లలో ‘బా బా బ్లాక్ షీప్’ చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అన్నారు. దర్శకుడు గుణి మంచికంటి మాట్లాడుతూ.. “ఇది రొటీన్ హీరో, హీరోయిన్, విలన్ తరహా సినిమా కాదు. ఇందులో కనిపించే ప్రతి పాత్ర ఎంతో కీలకం.

కుటుంబ సమేతంగా వెళ్లి చూసి ఆనందించదగ్గ చక్కని క్లీన్ సినిమా ఇది” అన్నారు. నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ.. “మా సినిమా అక్టోబర్ 9న రాబోతోంది. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు ఎంత పోటీ ఉన్నా అద్భుతాలు సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా సినిమా కూడా అలాంటి విజయమే సాధిస్తుందని బలంగా నమ్ముతున్నాం. షూటింగ్ కోసం వెళ్లినప్పుడు మేఘాలయ ప్రభుత్వం మాకు ఎంతో అండగా నిలిచింది. మేఘాలయ పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉంది.

దీనికోసం మేము ప్రత్యేకంగా ఒక కాంటెస్ట్ కూడా నిర్వహిస్తున్నాం. అందులో గెలిచిన వారు మా మూవీ టీమ్ తరఫున మేఘాలయ ట్రిప్‌కి వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నాం” అని చెప్పారు. నటి మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ.. “థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులకు ఒక మంచి సర్‌ప్రైజ్ దొరుకుతుంది. ఇందులో నా పాత్ర పేరు ‘రమ’, కొంచెం గ్రే షేడ్స్ ఉండే పాత్ర అది” అని చెప్పింది.

నటి సమృద్ధి ఆర్యాళ్ మాట్లాడుతూ.. “సినిమా కంటే కూడా, ఈ మూవీ యూనిట్‌తో వర్క్ చేస్తూ నేను పొందిన అనుభవం నాకెంతో ప్రత్యేకం. కొత్తదాన్ననే భావన కలగనివ్వలేదు. తెలుగులో నాకు తొలి సినిమా. భాష రాక మొదట్లో తెలుగు డైలాగ్స్ చెప్పడం ఇబ్బందినిపించింది. కానీ డైలాగులు బట్టీ పట్టి మరీ పూర్తి చేశాను” అని తెలిపింది. ఇంకా ఈ కార్యక్రమంలో నటులు విష్ణు ఓయ్, అక్షయ్ లగుసాని కూడా మాట్లాడారు. 

మరిన్ని వార్తలు