విమర్శల హోరు... నిరసనల జోరు
రసమయి అనుచిత వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్
మానకొండూర్‌లో ధర్నా, రాస్తారోకో
రసమయి దిష్టిబొమ్మ దహనం
మానకొండూరు, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Kavampalli Satyanarayana,), మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ల(Former MLA Rasamayi Balakishan's) మధ్య రాజకీయ విమర్శలు, మాటల తూటాలు జోరుగా పేలుతున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దిష్టిబొమ్మ దహనాలు, రోడ్డుపై నిరసనలతో మండల, నియోజకవర్గ కేంద్రమైన మానకొండూరు గత వారం రోజులుగా అట్టుడుకుతుంది. తాజాగా ఆదివారం కవ్వంపల్లి సత్యనారాయణ, కుటుంబ సభ్యులపై రసమయి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, మానకొండూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేసి రసమయి దిష్టిబొమ్మను దహనం చేశారు.
అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రసమయి తీరుపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి, పచ్చునూరు, గుండారం గ్రామాలలో ఎక్కడైనా అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. తేదీ, సమయం రసమయి ప్రకటిస్తే తాము రావడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కనకం అశోక్, ఎస్టీ సెల్ నాయకుడు రేవెల్లి రాజలింగం మాట్లాడుతూ రసమయి బాలకిషన్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణపై రాజకీయ విమర్శలు చేయకుండా ఆయనపైన, ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఎమ్మెల్యే స్వగ్రామం పచ్చునూరులో అక్రమంగా 20 ఎకరాల భూమి సంపాదించి వాటిలో ఫామ్‌హౌస్ కడుతున్నారని రసమయి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. రసమయి బాలకిషన్ రాజకీయాల్లోకి రాకముందే 2006లో 14 ఎకరాల భూమి కలిగి ఉన్నారని, గ్రామంలో ప్రభుత్వ భూములు, ఇతరుల భూములను ఇంచు మాత్రం కూడా ఆయన కబ్జాకు పాల్పడలేదని వారు స్పష్టం చేశారు.
పచ్చునూరు భూములపై చేసిన ఆరోపణలు నిరూపించగలిగితే ఆ భూములను రసమయికి ధారాదత్తం చేస్తామని వారు స్పష్టం చేశారు. పాత్రికేయుల సాక్షిగా కవ్వంపల్లి వ్యవసాయ భూమిని పరిశీలించాలని, నిజంగా అది ఫామ్‌హౌస్ అయితే, రసమయికే రాసిస్తామన్నారు. వాస్తవానికి అక్కడ ఎమ్మెల్యే సొంత ఖర్చుతో వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను ఫామ్‌హౌస్‌గా చిత్రీకరించి దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. అలాగే 350 కోట్లతో మెడికల్ కాలేజీ నడుపుతున్నాడని చేసిన ఆరోపణలు కూడా పూర్తిగా అవాస్తవమని వారు పేర్కొన్నారు.
నిరూపిస్తే రసమయికి ఆ మెడికల్ కాలేజీని అతని పేరిట రాసిస్తానని డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన ప్రకటనను వారు ఈ సందర్భంగా ఉటంకించారు. ఇకముందు ఎమ్మెల్యే కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆరోపణలు చేసేముందు వాస్తవ పరిస్థితులను నిర్ధారించుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా రసమయి తన తీరు, మాట్లాడే భాష మార్చుకోవాలని, లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్ర చారి, ప్యాక్స్ చైర్మన్లు రెంటాల లక్ష్మారెడ్డి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, నాగిశెట్టి రాజయ్య, పార్టీ నాయకులు రేమిడి శ్రీనివాస్ రెడ్డి, మర్రి ఓదెలు యాదవ్, రామిడి తిరుమల్ రెడ్డి, బుర్ర శ్రీధర్ గౌడ్, మాడ తిరుపతి రెడ్డి, రామడుగు హరీష్, ఎన్. బాపురావు, గొల్లెన కొమురయ్య, గుడాల మహేందర్, బందెల మహేందర్, కనకం కుమార్, కె. శ్రీనివాస్, కోండ్ర సురేష్, సంపత్, చంద్రాకర్, మొగిలి, అంజిరెడ్డి, సాయిరి దేవయ్య, తమిశెట్టి రాజేష్, దూలం వీరస్వామి, అంకూస్, వరహాలచారి, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.






