బీసీలకు అవకాశం ఇవ్వాలి

01-10-2026 | 05:20am

బీసీలను విస్మరిస్తే కాంగ్రెస్ పతనం ఖాయం 

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నిప్పులు చెరిగిన జాజుల  

ముషీరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ అవకాశం ఇచ్చి రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని నిట్ట నిలువునా బొంద పెడుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్(Jajula Srinivas Goud) మండిపడ్డారు.

బుధవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో జాజుల మాట్లాడారు. రాష్ట్రంలో కులగణన చేసి దేశానికి రోల్ మోడల్‌గా నిలిచామని, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగబోయే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్‌నగర్, నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సర్వోత్తమరెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డిలను ప్రకటించడం చాలా సిగ్గుచేటన్నారు.

కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలకు, చేసే చేతలకు ఎక్కడ పొంతనలేదని అందుకు ఉదాహరణనే రెండు టికెట్లకు గాను రెండు ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం చూస్తే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మాటలు నీటి మూటలని తేలిపోయిందన్నా రు. రాష్ట్రంలో కులగణన చేయకముందు ఎలా ఉందో కులగణన చేసిన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేదని, 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాయమాటలు చెప్పి, మంత్రివర్గంలో, నామినేటెడ్ పోస్టు ల్లో, ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపులు ఎందుకు 42 శాతం అమలు చేయడం లేదని ఆయన నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీ పునః పరిశీలన చేసి ఆ అభ్యర్థులను ఉపసంహరించుకొని కాంగ్రెస్ పార్టీలో జండా మోసిన బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అవకాశం కల్పించాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా భారీ నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, యువ జన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కుర్మా, రావులకోల్ నరేష్ ప్రజాపతి, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్, నరసింహ నాయక్, గూడూరు భాస్కర్ మేరు, కొప్పుల చందు గౌడ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు