కాంగ్రెస్‌దీ బీఆర్ఎస్ దారే!
- కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం
- 900 కోట్లు ఖర్చు చేస్తే నీటి సమస్య వచ్చేది కాదు
- కేఆర్ఎంబీ ఎదుట నీటి వాటా కోసం వాదించని ప్రభుత్వం
- ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- నాగార్జునసాగర్‌లో నీటి మట్టం పరిశీలన
- దుప్పల్లపల్లిలో ఎండిన పంట పొలం పరిశీలన
నల్లగొండ బ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తూ అదేదారిని అనుసరిస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు(BJP State President N. Ramchander Rao) ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో బుధవారం పర్యటించిన ఆయన నాగార్జున సాగర్‌లో నీటి మట్టాన్ని పరిశీలించారు. నల్లగొండ పట్టణంలోని హిందూపూ ర్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని రోడ్లు శుభ్రం చేశారు. మేళ్లదుప్పలపల్లి, మాదారం గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణానది తీరం ఎక్కువగా తెలంగాణలోనే ఉన్నదని, ఏటా 811 టీఎంసీల వరద ప్రవా హం వస్తుందని తెలిపారు. తెలంగాణకు 513 టీఎంసీల వాటా రావాల్సి ఉండగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేవలం 299 టీఎంసీలకు సంతకం చేసి తెలంగాణ రైతులకు తీరని అన్యాయం చేశారని విమర్శిం చారు. కనీసం కేఆర్ఎంబీ ఎదుట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నీటి వాటా కోసం గట్టిగా వాదించడం లేదని విమర్శించారు. వెంటనే కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతంగా వాదించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ రూ.1,36,000 కోట్లు ఖర్చు చేసిం దని, జూరాల కింద రిజర్వాయర్లు నిర్మించి ఉంటే సమస్య తీరేదన్నారు. కేవలం రూ. 900 కోట్లు ఖర్చు చేసి నెట్టెంపాడు, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నీటి సమస్యే ఉండేది కాదని, రిజర్వాయర్లకు కేం ద్రం నుంచి అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. ఆల్మట్టి ప్రాజెక్టు 5 మీటర్ల ఎత్తు పెంపును వెంటనే అడ్డుకోవాలని, గతంలో కేసీఆర్ అడ్డుకోలేదు, ఇప్పుడు కాం గ్రెస్ కూడా అడ్డుకోవడం లేదని అన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ డిజైనింగే తప్పని, దీన్ని ఘోష్ కమిషన్ కూడా తప్పుపట్టిందని గుర్తు చేశారు. ఎల్ నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు ముందే చెప్పినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని, రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించలేదన్నారు. దీనికి తోడు నల్లగొండ జిల్లాలో రోజుకు 5 గంటలు కూడా కరెంట్ సక్రమం గా ఇవ్వకపోవడంతో వరి, పత్తి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బొగ్గును సక్రమంగా వినియోగించుకోలేని ప్రభుత్వం
థర్మల్, హైడల్, సోలార్ విద్యుత్ పై ఆధారపడటం, సింగరేణిలో బొగ్గు కొరత ఉంటే కేంద్రం బొగ్గు సరఫరా చేస్తున్నదని రాంచందర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బొగ్గును సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్లే విద్యుత్ సంక్షోభం వచ్చిందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
రైతు బీమా, ఫసల్ బీమా అమలు కావడం లేదని, కొందరు రైతులకు బీమా గురించి తెలుసని మరికొందరు తెలవదని చెపుతున్నారని పేర్కొన్నారు. ఎండిన పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవపురం లక్ష్మీనారాయణ, జిల్లా ఇన్చార్జి ఉదయ్ ప్రతాప్, రాష్ట్ర కార్యదర్శి తూటుపల్లి రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యామ్ సుందర్ యాదవ్, మాదగాని శ్రీనివాస్‌గౌడ్, వేరేలి చంద్రశేఖర్, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, కంకణాల శ్రీధర్‌రెడ్డి, పాలకూరి రవిగౌడ్, పక్కిరు మోహన్‌రెడ్డి, పోతేపాక లింగస్వామి, మిర్యాల వెంకటేశం పాల్గొన్నారు.