విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి
రామాయంపేట,(విజయక్రాంతి): విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను సకాలంలో విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు తీవ్రంగా విమర్శించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని, బీజేపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee reimbursement), స్కాలర్‌షిప్‌లు అందక అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ కీలక సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు.
విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని రాగి రాములు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరిని విడనాడి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల పక్షాన మరింత పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ ఎప్పటికీ అండగా నిలుస్తుందని, ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి, మండల అధ్యక్షులు నవీన్, అక్కన్నపేట సర్పంచ్ బక్కయ్య గారి యాదగిరి, నందిగామ సర్పంచ్ ఆకుల రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు రంగయ్య, దంతపల్లి సర్పంచ్ బాలరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శేఖర్, అక్కన్నపేట మాజీ సర్పంచ్ వెనుముల సిద్ధరాములు, పట్టణ మాజీ అధ్యక్షులు భానుచందర్, కిసాన్ మోర్చా కార్యదర్శి ఏలగారి అశోక్, పట్టణ ప్రధాన కార్యదర్శి అక్కల అనిల్, యువ మోర్చా నాయకులు భాష, అనిల్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
