ఆలయాల భద్రతను పటిష్టం చేయాలి

03-10-2026 | 11:28pm

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు 

ఎల్బీనగర్, అక్టోబర్ 3 : దిల్‌సుఖ్‌నగర్‌లోని సంతోషీమాత ఆలయంలో(Santoshi Mata Temple) అమ్మవారి విగ్రహంపై జరిగిన దాడి ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఘటన జరిగిన ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు(N. Ramchander Rao), పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం రాత్రి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామచందర్‌రావు మాట్లాడుతూ... సంతోషీమాత ఆలయంలో(Santoshi Mata Temple) జరిగిన ఘటనపై  తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

హిందూ దేవాలయాల భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. “హిందూ దేవతలను విశ్వసించని మరో మతానికి చెందిన వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహంపై దాడి చేశాడని, ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ముత్యాలమ్మ ఆలయ ఘటన నుంచి ఇటీవల జరిగిన ఇతర ఆలయ ఘటనల వరకు పలు ఘటనలను ప్రస్తావిస్తూ, దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు.

అమ్మవారి ఆలయాలే లక్ష్యంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. నిందితుల విషయంలో పోలీసులు ప్రతిసారీ మానసిక పరిస్థితి సరిగా లేదనే కోణంలో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆలయాల వద్ద భద్రతను పెంచాలని, ఘటనల వెనుక అసలు కారణాలను సమగ్రంగా దర్యాప్తు చేయాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు