అర్ధరాత్రి ఇసుక తరలింపునకు అనుమతి ఇస్తున్నారా?
అధికార పార్టీ హస్తంతో దర్జాగా ఇసుక దందా చేస్తుండ్రు
అధికారం ఉంటే ఇష్టం సారంగా వ్యవహరిస్తారా!
ప్రజా ప్రయోజనాలను పట్టించుకోకుండా ఎట్లా?
అక్రమ ఇసుక నిలిపివేయాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
మాజీ ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి
చిన్నచింతకుంట, సెప్టెంబర్ 7: రాత్రి అయ్యిందంటే చాలు ఇక పదండి పోదాం... అధికారం మనదే అందరి అండదండలు మనకే.. మనల్ని ఆపేదెవరు? తెల్లారేసరికి మన టార్గెట్ రీచ్ కావాల్సిందే... ఎవరైనా అడ్డొస్తే వారి సంగతి చూస్తాం.. అసలే అర్ధరాత్రి వచ్చేదెవరు. ఆపేదెవరు? అనే రీతిలో సిసి కుంట మండల పరిధిలోని ఊకచెట్టు వాగులో అక్రమ ఇసుక దందా(Illegal Sand Trade) అర్ధరాత్రి సక్రమంగా జరుగుతుందని మాజీ ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి(Former MPP Harshavardhan Reddy) నేరుగా పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేసిండ్రు.
తప్పిపోయిన వ్యక్తులను సైతం పట్టుకొని చట్టం ముందు నిలబెడుతున్న పోలీస్ యంత్రాంగం అర్ధరాత్రి ఇసుక అక్రమంగా జరుగుతుందని ఫిర్యాదు చేసిన ఎందుకు స్పందించడం లేదు అర్థం కాని పరిస్థితి ఉందంటూ వారు అసహనం వ్యక్తం చేస్తుండ్రు. ఈ విషయంపై నిర్లక్ష్యం చేస్తే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు పేర్కొంటున్నారు.
అర్ధరాత్రి వేళ ఇసుక లారీల దందా
ఊకచెట్టు వాగు పరివాహక గ్రామాల రైతులు ఇచ్చిన సమాచారంతో అర్ధరాత్రి 11:30 నుంచి 1:00 గంటల మధ్య పరిశీలించగా సుమారు 6 నుంచి 7 భారీ టారస్ లారీలతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించినట్లు వారు చెబుతున్నారు. తాము అక్కడికి చేరుకునేసరికి రెండు లారీల ఇసుకను అన్-లోడ్ చేసి పరారయ్యారని, లాల్కోట గ్రామ సమీపంలో మరో రెండు లారీలను పట్టుకున్నామని తెలిపారు. ఆ వాహనాలు మాయిగావ్ గ్రామానికి చెందినవిగా తేలిందని పేర్కొన్నారు.
పోలీసులు, అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు అక్రమంగా తరలిస్తున్న వాహనాల సమాచారాన్ని వెంటనే స్థానిక పోలీసులకు అందించినప్పటికీ సరైన సమయంలో స్పందించకపోవడం దారుణమన్నారు. ఎన్నికల ముందు ‘పిడికెడు ఇసుక కూడా బయటకు పోనివ్వం‘ అని చెప్పిన అధికార పార్టీ నేతలే, నేడు అండదండలు అందిస్తూ ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. కేవలం ఊకచెట్టు వాగు మాత్రమే కాకుండా పేరూరు, వెంకంపల్లి పరిసర వాగుల నుంచి కూడా అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందని ధ్వజమెత్తారు.
అసలే వర్షాలు లేవు.. ఉన్న ఇసుక తీస్తే ఎట్లా?
అసలే వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసిన పంట పండుతుందో పండదో తెలియని దుస్థితి నెలకొంది. కేవలం ఇసుక అక్రమంగా తరలిస్తాం సొమ్ము చేసుకుంటాం అంటే ఎట్లా. రైతుల సంక్షేమం కోసం కొంతమైనా ఆలోచించరా అంటూ వారు అసహనం వ్యక్తం చేశారు.
అధికార పార్టీ నేతలకు ఈ దందాతో సంబంధం లేకపోతే తక్షణమే ఉన్నతాధికారులు, పోలీసులతో తనిఖీలు చేయించి వాహనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోయేలా చేస్తూ రైతుల నోట్లో మట్టికొట్టే ఈ అక్రమ తవ్వకాలను నిలువరించకపోతే రైతాంగాన్ని ఏకం చేసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పిర్యాదు చేసిన వారిలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
