కోరుట్ల వినాయక విగ్రహాలకు నాలుగు దశాబ్దాల చరిత్ర

08-09-2026 | 05:10am
  1. కోరుట్ల కేంద్రంగా పలు ప్రాంతాలకు తరలింపు

వేలాది మంది నిరుపేదలకు ఉపాధి

వలస వచ్చిన పలు రాష్ట్రాల కార్మికులు

కోరుట్ల,సెప్టెంబర్7(విజయక్రాంతి) వినాయక నవరాత్రులు వచ్చాయంటే చాలు దేశ వ్యాప్తంగా ప్రధాన పట్టణాలు, మారుమూల గ్రామాల్లో సైతం సందడి నెలకొంటుంది. దే వాలయ కమిటీలతో పాటూ కుల సంఘా లు, యువజన సంఘాలు, చివరికి బాల సం ఘాల వారు సైతం గణేష్ నవరాత్రుల నిర్వహణలో ఎంతో బిజీగా పాల్గొనడం చూస్తూ నే ఉన్నాం.. భారత స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో అప్పటి మహా నాయకుడు స్వర్గీయ బాలగంగాధర్ తిలక్ దేశ ప్రజల సమైక్యత కోసం ప్రారంభించిన ఈ వినాయక నవరాత్రులు ఆనాటి నుండి నిరవధికంగా కొనసా గుతూనే ఉన్నాయి.

ప్రతి ఏడాది భాద్రపద శుద్ధ చవితి నాడు మొదలై, అనంత చతుర్దశి వరకు జరిగే ఈ ఉత్సవాల్లో లక్షలాది భక్తులు పాల్గొని తరించడం ఆనవాయితీ. ఈ నవరాత్రోత్సవాల నిర్వహణలో కీలకమైంది వినాయకుని విగ్రహం. ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విగ్రహాల తయారీ వే లాది మంది కార్మికులకు ఉపాధి మార్గంగా మారిన వైనంపై విజయక్రాంతి ప్రత్యేక కథనం...దేశవ్యాప్తంగా జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం కోట్లాది వినాయక విగ్రహాలు రూపు దిద్దుకుంటాయి.

ఈ నేపథ్యంలో ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణానికి ప్రత్యేక స్థానం ఉంది. గత నాలుగు దశా బ్దాలకు పైగా కోరుట్ల నియోజకవర్గ కేంద్రం నుండి వినాయక విగ్రహాల తయారీ కొనసాగుతున్నది. ఈ క్రమంలో కోరుట్ల కేంద్రంగా సుమారు 40 వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల్లో ఏడాదికి నికరంగా వేలాది మంది కార్మికుల చేతుల్లో లక్షలాది వినాయక విగ్రహాలు రూపు దిద్దుకుంటున్నాయి.

గతంలో మహారాష్ట్ర, రాజస్థాన్ ప్రాంతాల నుండి మ న తెలంగాణ ప్రాంతానికి వినాయక విగ్రహా లు దిగుమతయ్యేవి. అలాంటిది ప్రస్తుతం మన తెలంగాణతో పాటూ మహారాష్ట్ర, ఉత్త ర ప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్ వంటి రా ష్ట్రాల కార్మికులకు వినాయక విగ్రహాల త యారీ ఉపాధి మార్గంగా మారింది. 1980వ దశాబ్దంలో తెలంగాణలో మొదటగా కోరు ట్ల నియోజకవర్గ కేంద్రంలో రూపుదిద్దుకున్న వినాయక విగ్రహాల తయారీ,

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ప ట్టణాలతో పాటూ మారుమూల ప్రాంతాల్లో కూడా ఉపాధి మార్గంగా మారింది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం ఒడ్యా డుకు చెందిన ’పోలపల్లి గంగాధర్’ స్వతహాగా మంచి చిత్రకారుడు, నగిశీ తయారీ కళాకారుడు. 1980లో ఉపాధి నిమిత్తం ఆయన మహారాష్ట్రలోని ముంబై నగరానికి వెళ్ళి, అక్కడ వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో చేరాడు.

మూడు సంవత్సరాల శిక్షణ అనంతరం స్వగ్రామానికి తిరిగి వచ్చిన గంగాధర్, తన బంధు మిత్రుల సూచన మేరకు 1983లో కోరుట్ల పట్టణంలో ’శిల్ప కళా ఆర్ట్’ పేర వినాయక విగ్రహాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాడు. వినాయక నవరాత్రోత్సవాల కోసం మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల నుండి వినాయక విగ్రహాలను దిగుమతి చేసుకుంటున్న తరుణంలో ’శిల్పకళా గంగాధర్’ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి మన తెలంగాణలోనే వినాయక విగ్రహాల తయారీని ప్రారంభించాడు.

వినాయక విగ్రహాల తయారీ కోసం తమిళనాడులోని సేలం నుండి ’కొబ్బరి పీచు’ రాజస్థాన్ నుండి ’జిప్సం’ దిగుమతి చేసుకొని గంగాధర్ విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించాడు. ఆయన చేతిలో రూపు దిద్దుకొన్న విగ్రహాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కరీంనగర్ జిల్లాతో పాటూ నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, బోధన్, గోదావరిఖని తదితర ప్రాంతాలకు గంగాధర్ తయారు చేసిన విగ్రహాలు ఎగుమతయ్యాయి.

దాంతో గంగాధర్ శిల్పకళా ఆరట్స్ కేంద్రంలో విగ్రహాల తయారీ శిక్షణ పొందిన పలువురు తాము సైతం స్వంతంగా విగ్రహాల తయారీ కేంద్రాలను పెట్టడం ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో గంగాధర్ దగ్గర శిక్షణ పొందిన సుమారు 300 మంది కళాకారులు ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో భాగంగా నాణ్యత కొంత తక్కువైనప్పటికీ సేలం నుండి కాకుండా, ఆంధ్రప్రదేశ్’లోని రాజమండ్రి, పాలకొల్లు, ప్రాంతాల నుండి కొబ్బరి పీచు దిగుమతి చేసుకుంటున్నారు.

వినాయక ఉత్సవాల నిర్వాహకుల కోరిక మేరకు జిప్సంతో పాటూ ఎకో ఫ్రెండ్లీ నినాదంతో ’మట్టి విగ్రహాల’ను సైతం కోరుట్లలోనే తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కార్మికులు కోరుట్లకు వచ్చి వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల్లో ఉపాధి పొందుతున్నారు. వినాయక విగ్రహాల తయారీలో ’కోరుట్ల’కు ప్రత్యేక గుర్తింపు రాగా,

ఇప్పటికీ ’శిల్పకళ గంగాధర్’ చేతిలో వేలాది గణనాథుని విగ్రహాలు అందంగా రూపుదిద్దుకుం టూనే ఉన్నాయి.భారత స్వాతంత్ర ఉద్యమం లో భాగంగా దేశ ప్రజల సమైక్యత కోసం ప్రారంభమైన ఈ వినాయక నవరాత్రులు, ప్రస్తుతం వేలాది మందికి జీవనోపాధి మా ర్గంగా మారాయి. వందలాది కుటుంబాలు, వేలాది మంది కార్మికులు ఈ వినాయకుని మూలంగాఉపాధిపొందుతున్నారు.

ప్రస్తుతం కోరుట్ల పట్టణంలో 40 వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలుండడం గమనార్హం. వీటితో పాటూ మరో 15 వరకు విగ్రహాల తయారీ కాకుండా కేవలం విక్రయ కేంద్రాలు వెలిశాయి. మొత్తం మీద దేశ ప్రజల సమైక్యత కోసం అలనాడు ఆరంభమైన ’వినాయక నవరాత్రి ఉత్సవాలు’ కోరుట్ల ప్రాంతంలో మాత్రం ఉపాధి మార్గాలుగా మారాయి.

తయారీ కేంద్రాల, విక్రయ కేంద్రాల నిర్వాహకులతో పాటూ తయారీ కార్మికులు, ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు,క్రేన్లు, హమాలి కార్మికులు, సదరు ప్రాంతాల్లో హోటల్ నిర్వాహకులకు ఉపాధి కల్పిస్తున్నాడు.


మరిన్ని వార్తలు