135 మంది విద్యార్థులకు.. ముగ్గురే టీచర్లు
మగ్దుంపూర్ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత
నంగునూరు, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): ప్రభుత్వ బడుల్లో(Government schools) నాణ్యమైన విద్య అందుతుందన్న నమ్మకంతో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచారు. అయితే, విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉపాధ్యాయుల సంఖ్య లేకపోవడంతో బోధన పూర్తిగా భారంగా మారుతోంది. నంగునూరు మండలంలోని మాగ్ధూంపూర్ ప్రాథమిక పాఠశాలలో ఇదే పరిస్థితి నెలకొంది. గత విద్యా సంవత్సరంలో 108గా ఉన్న విద్యార్థుల సంఖ్య, ఈ ఏడాది గ్రామస్తుల ప్రత్యేక కృషి ఫలితంగా 135కి చేరుకుంది.
ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పటికీ, ఈ పాఠశాలలో ప్రస్తుతం కేవలం ఒక ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) నిబంధనల ప్రకారం 135 మంది విద్యార్థులకు కనీసం 5 మంది ఉపాధ్యాయులు ఉండాలి.కానీ, కేవలం ముగ్గురు మాత్రమే ఉండటంతో ఒకే ఉపాధ్యాయుడు రెండు,మూడు తరగతులను కలిపి బోధించాల్సిన దుస్థితి ఏర్పడింది.ఉపాధ్యాయులు ఎవరైనా సెలవు పెడితే పాఠశాల నిర్వహణే భారంగా మారుతుందని,సిబ్బంది కొరత కారణంగా తమ పిల్లల చదువు వెనుకబడుతోందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే పరిష్కరిస్తాం
మాగ్ధూంపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న మాట వాస్తవమే.ఈ విషయం ఇటీవలే నా దృష్టికి వచ్చింది. పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లను, త్వరలోనే సర్దుబాటు పద్ధతిలోనైనా ఉపాధ్యాయులను కేటాయించి సమస్యను పరిష్కరిస్తాం
ఇంచార్జ్ ఎంఈఓ నంగునూరు
ఉపాధ్యాయుల కొరతను తీర్చాలి
ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో తామంతా కలిసి గ్రామస్తులందరినీ ఒప్పించి పిల్లలను చేర్పిస్తే,సరిపడా ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు సరైన నాణ్యమైన విద్య అందడం లేదు.అధికారులు వెంటనే స్పందించి అదనపు ఉపాధ్యాయులను కేటాయించాలి.తద్వారా విద్యార్థుల కొరత తీరి వారికి మెరుగైన విద్య అందుతుంది.
పాకాల శ్రీనివాస్, సర్పంచ్, మాగ్ధూంపూర్
