కమల దళంలో ‘త్రిమూర్తుల’ పోరు

08-09-2026 | 05:15am
  1. షాద్‌నగర్ బీజేపీలో గందరగోళం
  2. ఎవరికి వారే యమునా తీరే 
  3. దిక్కుతోచని స్థితిలో క్యాడర్

షాద్‌నగర్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది షాద్నగర్ నియోజకవర్గ బీజేపీ పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపిస్తున్న ప్రజలు, అసెంబ్లీ మరియు స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం కమలం వైపు చూడటానికి సైతం వెనుకాడుతున్నారు. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, తీవ్రమైన గ్రూపు రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలే పార్టీని పాతాళానికి తొక్కుతున్నాయని స్థానిక కార్యకర్తలు, అభిమానులు వాపోతున్నారు.  

‘త్రిమూర్తుల’ పోరు.. క్యాడర్ బలి..

నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించాల్సిన ముగ్గురు అగ్రనేతల అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీవర్ధన్ రెడ్డి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ల కోసం పోటీపడి పోట్లాడుకోవడం, ఎన్నికలు అయిపోగానే ఎవరి గోల వారు చూసుకోవడం వీరికి పరిపాటిగా మారింది.ఒకే పార్టీలో ఉంటూ ఎవరికి వారే ప్రెస్ మీట్లు పెట్టడం,

సమాంతర కార్యక్రమాలు నిర్వహించడంతో అసలు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎవరో తెలియక క్యాడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది. మైకుల ముందు ప్రసంగాలు, ప్రగల్భాలు తప్ప వీరు క్షేత్రస్థాయిలో చేస్తున్న గ్రౌండ్ వర్క్ శూన్యమని పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  

స్థానిక ఎన్నికల్లో ఘోర పరాభవం..

లోక్సభ ఎన్నికల్లో అద్భుత ఆదరణ పొందిన బీజేపీ, స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం తీవ్రంగా విఫలమైంది. 9వ వార్డు ఇక్కడ గెలిచిన ప్యాట అశోక్ విజయం ఆయన వ్యక్తిగత ఇమేజ్ వల్లే తప్ప, పార్టీ ఖాతాలో పడింది ఏమీ లేదనేది స్పష్టం. 16వ వార్డు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీవర్ధన్ రెడ్డి నివాసం ఉండే ఈ వార్డులో, పోటీ చేసిన బీజేపీ అభ్యర్థినికి వచ్చినవి కేవలం 36 ఓట్లు మాత్రమే.6వ వార్డు గత అసెంబ్లీ అభ్యర్థి అందె బాబయ్య ఇన్చార్జిగా వ్యవహరించిన ఈ వార్డులో పార్టీ అభ్యర్థికి పడింది కేవలం 127 ఓట్లు.

రచ్చకెక్కిన అంతర్గత విభేదాలు.. రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు

ఇటీవల ఈ వర్గపోరు మరింత శృతిమించి రచ్చకెక్కింది. 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అందే బాబయ్య, స్థానిక నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిపై ఆగస్టు 26, 2026న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.  2023లో టికెట్ రాలేదని ప్రధాని మోదీ ఫ్లెక్సీలను తన్ని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఫోర్వర్డ్ బ్లాక్ (’సింహం’ గుర్తు) నుంచి పోటీ చేశారు. 

లోక్సభ ఎన్నికల వేళ మళ్లీ పార్టీలోకి వచ్చినా, అధికారిక యంత్రాంగాన్ని పక్కనబెట్టి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు.  పార్టీ అధికారిక సమావేశంలో వందేమాతరం ఆలపిస్తుండగా, విష్ణువర్ధన్ రెడ్డి మద్దతుదారులు ఆయన పేరు ప్రస్తావించలేదనే నెపంతో అడ్డంకులు సృష్టించారు.  

ఇతర సంఘాల నిరసనల్లో భాగస్వామ్యం..

పార్టీ నాయకత్వానికి సమాచారం లేకుండా ఏఐఎస్‌ఎఫ్  ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో పాల్గొని కార్యకర్తలను అయోమయానికి గురిచేశారు.  బీజేపీ కంటెస్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ అని అనధికారిక హోదాలతో పోస్టర్లు వేయించుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అయితే ఈ ఫిర్యాదు ఆరోపణలను పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఖండించినట్లు సమాచారం.

అధిష్టానం దిద్దుబాటు చర్యలేవి?

కాంగ్రెస్ గెలవడం, బీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇవ్వడం, చివరకు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమ సత్తా చాటుకోవడం స్థానికంగా జరిగింది. కానీ బీజేపీ మాత్రం ఉనికి కోల్పోతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాణం పెట్టి పనిచేసే దిగువ స్థాయి కార్యకర్తలకు సర్పం,

మున్సిపల్ ఎన్నికల సమయంలో అగ్రనాయకులు సహకరించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని షాద్నగర్ బీజేపీలోని గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టకపోతే, రాబోయే రోజుల్లో పార్టీ తీవ్ర నష్టపోవడం ఖాయం.

మరిన్ని వార్తలు