భగీరథ నీరు కలుషితం?
అడుగడుగునా లీకేజీలు
కేసముద్రం, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణంలో అనేక చోట్ల మిషన్ భగీరథ పైప్ లైన్ కు లీకేజీలు ఏర్పడ్డాయి. దీనితో నీరు కలుషితం అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీకేజీలకు మరమ్మతులు చేపట్టకుండా నీటి సరఫరా చేస్తుండడంతో అదే నీటిని ప్రజలు తాగాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసముద్రం పట్టణంలో ప్రధాన రహదారుల విస్తరణ పనులు ఇటీవల చేపట్టారు.
అయితే రోడ్ల దిగువన అనేకచోట్ల మిషన్ భగీరథ పైప్లైన్ ఉన్నప్పటికీ, ఆ పైప్ లైన్ అలాగే ఉంచి రోడ్లను విస్తరించారు. దీనితో పైప్ లైన్లపై రోడ్డు రోలర్లు నడపడం వల్ల అనేక చోట్ల పైప్ లైన్ దెబ్బతిని లీకేజీలు ఏర్పడ్డాయి. దీనితో గత కొన్ని నెలలుగా కొత్తగా వేసిన రోడ్ల కింద నుండి లీకేజీల ద్వారా భగీరథ తాగునీరు బయటకు వస్తోంది. నల్లాలకు నీళ్లు వదిలిన వెంటనే నీరంతా బయటకు వచ్చి కలుషితమై, నల్లాలు బంద్ చేయగానే తిరిగి పైప్ లైన్ లోకి చేరి బురద నీరు వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మొదలుకొని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు, పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి కేసముద్రం దర్గా వరకు, మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్ల విస్తరణ చేపట్టినప్పటికీ రోడ్డు అడుగున ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ ను రోడ్డు పక్కన వేయకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనితో ప్రస్తుతం కలుషితమైన నీరు సేవించాల్సిన పరిస్థితి దాపురించిందని చెబుతున్నారు.
నీళ్లు వదలగానే రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయని, దీంతో కోట్ల రూపాయల ఖర్చుతో వేస్తున్న రోడ్ల నిర్మాణం అస్తవ్యస్తంగా మారిందని ఆరోపిస్తున్నారు. రోడ్ల విస్తరణ కోసం భగీరథ పైప్ లైన్ పూర్తిగా ధ్వంసం చేశారని, దీనితో కలుషితమైన నీరు తాగి అనారోగ్యం పాలు కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రోడ్ల వెంట ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు నిలువ ఉంటుందని, సైడ్ కాలువలో నిర్మించకపోవడం వల్ల రోడ్లపై తిష్ట వేసిన నీటిలో భగీరథ పైప్లైన్ నీరు చేరి కలుషితంగా మారి ప్రజలు అనారోగ్యం పాలు కావలసిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దెబ్బతిన్న పైప్ లైన్ తొలగించి, రోడ్డుకు ఇరువైపులా కొత్తగా పైప్ లైన్ వేయించి తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
