కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం

02-10-2026 | 08:38pm

దమ్మపేట, అక్టోబర్ 02 (విజయక్రాంతి): పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పించి నేటికీ 12సంవత్సరాలు ఐన సందర్బంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)కు కృతజ్ఞతలు తెలియజేస్తూ బిఆర్ఎస్(BRS) జిల్లా మాజీ అధ్యక్షులు రేగ కాంతారావు, నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు సూచన మేరకు దమ్మపేట మండల కేంద్రంలో మాజీ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించి, బాల్య వివాహాలను అరికట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి కే సి ఆర్ ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఒకే విడతలో రూ. 1,00,116 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిచిందని,  దివ్యాంగులైన యువతులకు రూ. 1,25,145 అందచేశారన్నారు. ముస్లిం, క్రైస్తవ మైనారిటీ యువతుల కొరకు ఇదే పథకాన్ని "షాదీ ముబారక్" పేరుతో అమలు చేశారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పధకానికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి ఆడబిడ్డలను మోసం చేసిందన్నారు. మరల కెసిఆర్ ముఖ్యమంత్రి ఐతే తప్ప తెలంగాణ బిడ్డల వెతలు తీరవని, మరలా ముఖ్యమంత్రిగా కెసిఆర్ రావాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జున రావు, మాజీ ఉప సర్పంచ్ దారా యుగందర్, మాజీ మండల ఊపాధ్యక్షులు గాజుబోయిన యేసు బాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు