30 July, 2026 | 1:08 AM

బీఆర్‌ఎస్ నేతలే టార్గెట్

30-07-2026 12:00 AM
  1. ‘పెద్ది’ మానసిక ఒత్తిడికి కారణం అదే
  2. సెక్యూరిటీ రివ్యూ కమిటీని రద్దు చేయాలి
  3. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): భద్రత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేస్తుందని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సెక్యూరిటీ రివ్యూ విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ వేధింపులు, భద్రత తొలగింపు వంటి చర్యల వల్లే పెద్ది తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని ఆరోపించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడి తిరిగి ప్రజల్లోకి రావాలని బీఆర్‌ఎస్ తరఫున ఆకాంక్షిస్తున్నామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు. ‘పెద్ది’ వరంగల్ జిల్లాలో ప్రాణాలకు తెగించి రాజకీయాలు చేశారని గుర్తు చేశారు.

ఆయనకు ప్రాణహాని ఉంటే ఆయుధ లైసెన్స్‌తో పాటు ప్రభుత్వ భద్రత కూడా కల్పించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సివిల్ సప్లైస్‌లో రూ.1,100 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టారని, గురుకుల పాఠశాలల్లో బంకర్ బెడ్ల కొనుగోళ్లలో జరిగిన అవినీతిని కూడా వెలుగులోకి తెచ్చారని, దీంతో ఆయనపై ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి గురయ్యారని అన్నారు.