కాంగ్రెస్ ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం: KTR

09-09-2026 | 02:59pm
  1. ప్రజలకే కాదు.. ప్రజా ప్రతినిధులకూ అవమానాలే
  2.  హామీలు అమలు కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
  3. మేం చేసిన నేరం ఏంటి?: కేటీఆర్
  4. అరచేతిలో స్వర్గం చూపి.. ప్రజలను మోసం చేశారు!

హైదరాబాద్:  తెలంగాణ ప్రస్తుత గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లాతో(Governor Shiv Pratap Shukla) బీఆర్ఎస్ సభ్యుల సమావేశం ముగిసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసుల తీరును నిరసిస్తూ గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గవర్నర్‌కు వివరంగా తెలిపామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Working President KTR) పేర్కొన్నారు. వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని అరచేతిలో స్వర్గం చూపారని ఆరోపించారు. అన్ని వర్గాలకు డిక్లరేషన్లు, బాండ్ పేపర్లు, అఫిడవిట్ల పేరిట 420 హామీలిచ్చారని గుర్తుచేశారు. ప్రజలకు హామీలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి వచ్చిందన్నారు.

ప్రభుత్వం లోకి వచ్చి వెయ్యి రోజులైన హామీలు అమలు చేయలేదని గవర్నర్ కు తెలిపామని వెల్లడించామన్నారు. రైతు బీమా(Rythu Bima) ఎగ్గొట్టి రైతులకు ధీమా లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేశారో వివరించామని తెలిపారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై నిరసన తెలిపేందుకు పార్లమెంట్ కు రాహుల్ గాంధీ(Rahul Gandhi) వెళ్లినట్లే తాము నల్ల టీషర్టులు వేసుకుని అసెంబ్లీకి వెళ్లామన్నారు. శాసనసభ్యులపై నడిరోడ్డుపై పోలీసులు ఎలా దాడి చేశారో గవర్నర్ కు ఆధారాలు చూపామన్నారు. సబితా ఇంద్రారెడ్డిపై(Sabitha Indra Reddy) పోలీసుల దాడి, అవమానంపై, సునీత చీర లాగి దుశ్శాసన పర్వానికి తెరలేపడంపై గవర్నర్ కు ఆధారాలు సమర్పించామని స్పష్టం చేశారు. తమపై దాడులు చేసి తమపైనే కేసులు పెట్టారని వివరించినట్లు పేర్కొన్నారు. దాడులపై కమిషనర్ కార్యాలయంలో(Commissioner Office) ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.



మరిన్ని వార్తలు