బుడ్డోడు వినతితో బస్సు సిద్ధం
ఎర్రబోయినపల్లికి ఆర్టీసీ శుభవార్త
కల్లూరు,(విజయ క్రాంతి): తమ ఊరికి బస్సు ఎప్పుడు వస్తుందా అని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న యర్రబోయినపల్లి గ్రామ ప్రజల చిరకాల వాంఛ త్వరలోనే నెరవేరనుంది.ఇకపై యర్రబోయినపల్లి రోడ్లపై ఆర్టీసీ బస్సు పరుగులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల కల్లూరు మున్సిపాలిటీ కేంద్రంలోని డిఎన్పి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన ఓ చిన్నారి “మా ఊరికి బస్సు కావాలి సార్” అంటూ చేసిన వినతి అందరి దృష్టిని ఆకర్షించింది.
చిన్నారి మాటలకు స్పందించిన మంత్రి వెంటనే ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసి,వారం రోజుల్లోనే యర్రబోయినపల్లికి బస్సు సర్వీసులు ప్రారంభించాలన్నారు. మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం మధిర డిపో మేనేజర్ తడికమళ్ళ దేవరాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పోట్రు అర్జున్ రావు, ఏఎంసీ డైరెక్టర్ దొడ్డపునేని శ్రీనివాసరావుతో కలిసి చెన్నూరు నుంచి యర్రబోయినపల్లి మీదుగా లింగాల వరకు బస్సు నడిపేందుకు అవసరమైన మార్గం,సౌకర్యాలు, ప్రజల అవసరాలను పరిశీలించారు.
గ్రామస్తుల అవసరాలను గమనించిన డిపో మేనేజర్,మధిర ఆర్టీసీ డిపో ఆర్‌ఎంకు నివేదిక సమర్పిస్తామని, త్వరలోనే యర్రబోయినపల్లికి బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.అదేవిధంగా కల్లూరు–మధిర సర్వీసుల్లో విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 5 లేదా 6 గంటల సమయంలో బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీంతో గ్రామ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసింది. చిన్నారి వినతితో ప్రారంభమైన ఈ ప్రయత్నం త్వరలో ఫలితాన్నిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






