సుభాష్ చంద్రపై సీబీఐ కేసు
- 1,322 కోట్ల మోసంపై ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్ ఫిర్యాదు
- 22వేల కోట్లకు 6.5 కోట్ల సెటిల్‌మెంట్‌తో వివాదం
- మరో ముగ్గురిపై కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు
- ఆస్తులు ఎక్కువ చూపి రుణాలు తీసుకున్నారని ఆరోపణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ‘మీడియా దిగ్గజం సుభాష్ చంద్ర(Subhash Chandra) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(Life Insurance Corporation Housing Finance Limited) (ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్) నుంచి రుణాలు(loans) పొందేందుకు తన నికర ఆస్తిని పెంచి చూపారు. ఆ తర్వాత రుణ ఎగవేతదారుగా మారారు. దీనివల్ల ఆ ప్రభుత్వ రంగ సంస్థ(public sector undertaking)కు రూ.1,322 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది’ అని ఆరోపిస్తూ సీబీఐ(Central Bureau of Investigation) ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని అధికారులు శనివారం తెలిపారు.
సుభాష్ చంద్ర((Subhash Chandra))తోపాటు పంకజ్ సురోలియా, అమిష్ పాండ్యా, రాజీవ్ ధోలకియాలపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్‌లో భాగంగా ఉన్న తన ఫిర్యాదులో, మొత్తం రూ.980 కోట్ల విలువైన రెండు రుణాల ఆమోదంతోపాటు పంపిణీని పొందేందుకు ఉపయోగపడిన నికర ఆస్తి ధ్రువీకరణ పత్రాలను సుభాష్‌చంద్ర సమర్పించారని ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్ ఆరోపించింది.
దాదాపు రూ.22,006 కోట్ల క్లెయిమ్‌లకు(claims), చంద్ర వ్యక్తిగత ఆస్తి నుంచి కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే వసూలు చేసుకోవడానికి రుణదాతలను అనుమతించే ఇటీవలి ఎన్‌సీఎల్‌టీ రుణ చెల్లింపు ప్రణాళికను వ్యతిరేకిస్తూ, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)ను ఆశ్రయించిన రుణదాతలలో ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్ కూడా ఒకటి.
ఈ ఫిర్యాదు ప్రకారం.. పాన్ ఇండియా ఇన్‌ఫ్రా ప్రాజెకట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను సహ-రుణ గ్రహీతగా చేర్చి, వసంత్ సాగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అందించిన రూ.500 కోట్ల రుణానికి, అలాగే స్పిరిట్ ఇన్‌ఫ్రా పవర్, మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను సహ-రుణగ్రహీతలుగా చేర్చి, డిజిటల్ సబ్‌స్ర్కైబర్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అందించిన రూ.480 కోట్ల రుణానికి సంబంధించినది.
‘సుభాష్ చంద్ర రుణగ్రహీత సంస్థలు, అలాగే వాటి అధికారులు, డైరెక్టర్లతో కుమ్మక్కై ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను మోసం చేశారు. తద్వారా ఆ సంస్థలకు రుణాలు మంజూరయ్యేలా చేసి, ఆ నిధులను దుర్వినియోగం చేశారు’ అని ఆరోపించింది. ప్రధాన రుణగ్రహీతలకు నిధులు విడుదల చేసేలా ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్‌ఎల్ ను మోసం చేయడానికి, వాస్తవానికి మించిన, తప్పుడు నికర విలువను చూపేలా నకిలీ పత్రాలను సృష్టించారని ఆరోపణలు చేస్తోంది.
2018 నుంచి 2026 మధ్య కాలంలో నేరపూరిత కుట్రలకు దిగారని ఎల్‌ఐసీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా సుభాష్ చంద్ర తన ఆస్తులను రూ.59,113 కోట్లుగా చూపించి వివిధ బ్యాంకుల్లో, సంస్థల్లో 22వేల కోట్ల రుణాలు పొందారు. వాటిని తీర్చడంలో విఫలమై దివాలా ప్రక్రియను ప్రకటించారు. అనంతరం ఎన్‌సీఎల్‌టీ ఏకసభ్య ధర్మాసనం 6.5 కోట్లకు సెటిల్‌మెంట్ తీర్పు ఇయ్యడం తీవ్ర కలకలం రేపి, పలు ఆరోపణలకు దారి తీసింది.
ఈ లోపు ఎల్‌ఐసీ సీబీఐని సంప్రదించింది. సుభాష్ చంద్రపై ఆర్థిక మోసాల కింద కేసు నమోదు చేయాలని, చర్యలు చేపట్టాలని పలు ఆధారాలను కూడా అందజేసింది. ఆధారాలను పరిశీలించిన సీబీఐ క్రిమినల్ కుట్ర, మోసం, నేరపూరిత నమ్మకద్రోహం తదితర ఆరోపణల కింద సుభాష్ చంద్రపై మరో ముగ్గురైన పంకజ్ సురోలియా, అమిష్ పాండ్యా, రాజీవ్ ధోలకియాలపై కూడా సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది.






