హైదరాబాద్ ఐకాన్‌కు ఏమైంది?

24-09-2026 | 12:40pm

హైదరాబాద్: హైదరాబాద్‌ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చార్మినార్‌(Charminar) వద్ద మరోసారి నిర్వహణ లోపాలు వెలుగుచూశాయి. చార్మినార్‌ మొదటి అంతస్తు నుంచి మరమ్మతులు జరుగుతున్న ప్రాంతానికి చెందిన అలంకార భాగాలు ఊడిపడి కిందకు పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ పర్యాటకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పగటి సమయంలో భారీగా సందర్శకులు ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై స్థానికులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చార్మినార్‌ నిర్వహణ, పరిరక్షణ విషయంలో పురావస్తు శాఖ తగిన శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు మరోసారి వినిపిస్తున్నాయి. గతంలోనూ మక్కా మసీదు వైపు, అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వైపు చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు మరోసారి నిర్మాణంలోని భాగాలు ఊడిపడటంతో చార్మినార్‌(Charminar security) భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు సందర్శించే ఈ చారిత్రక కట్టడం విషయంలో నిర్వహణ మరింత పటిష్టంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చార్మినార్‌ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు