చెడ్డ పేరు వచ్చినా.. మంచి పేరు వచ్చినా వారిదే!
హైదరాబాద్: ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే కేంద్రంగా కలెక్టరేట్లు పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని బుధవారం ప్రారంభించిన ఆయన.. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం కొత్త కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై జిల్లా పరిపాలన, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పేదలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే కార్యాలయంగా కలెక్టరేట్ ఉండాలని సూచించారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు చేరాలంటే ఉద్యోగులే కీలకమని పేర్కొన్నారు. సహాయం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలను తమ కుటుంబ సభ్యుల మాదిరిగా భావించి స్పందించాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ, అందరి సహకారంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.
3 శాతం ఉద్యోగులు.. 97 శాతం ప్రజలు
రాష్ట్రంలో సుమారు 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు 4 కోట్ల మంది ప్రజలకు సేవలు అందిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల సంఖ్య పరంగా చూస్తే తక్కువ శాతం మంది సిబ్బంది పెద్ద సంఖ్యలో ప్రజలకు సేవ చేయాల్సి రావడం బాధ్యతతో కూడుకున్న వ్యవహారమని అన్నారు. ప్రభుత్వం గురించి ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడినా, ప్రతికూల అభిప్రాయం వచ్చినా అందులో ఉద్యోగుల పనితీరు ప్రభావం ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు.
ప్రజలకు ఎన్ని చట్టాలు చేసినా, ఎంత నిధులు కేటాయించినా వాటి ప్రయోజనం క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉద్యోగులదేనని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రజా సమస్యల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వ పనితీరుపైనే విమర్శలు వస్తాయని పేర్కొంటూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
కేంద్రంతో సహకారం ఉండాలి
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.840 కోట్ల కేంద్ర నిధులు సాధించుకున్నామని సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరిస్తే ముఖ్యమంత్రిగా తాను అభినందించేందుకు ఎలాంటి సంకోచం లేదని చెప్పారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా తాము ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. మిగతా సమయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర–రాష్ట్ర సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు.. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు.