కోల్ ఇండియా ఉద్యోగులకు రూ.1,10,250 పీఎల్ఆర్
1.97 లక్షల మంది నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు ప్రయోజనం
సుదీర్ఘ చర్చల అనంతరం యూనియన్లు–యాజమాన్యం మధ్య ఒప్పందం
కోల్‌కతా, గోదావరిఖని, అక్టోబర్ 3(విజయ క్రాంతి): కోల్ ఇండియా లిమిటెడ్(Coal India Limited) ఉద్యోగులకు 2026 సంవత్సరానికి చెల్లించనున్న పనితీరు ఆధారిత బహుమతి(Performance-based reward) (పీఎల్ఆర్)పై శనివారం జరిగిన అపెక్స్ జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో(Apex Joint Consultative Committee Meeting) ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కోల్ ఇండియా చైర్మన్ బి. సాయిరామ్(Coal India Chairman B. Sairam) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనియన్ ప్రతినిధులు, యాజమాన్యం మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
మొదట యూనియన్ ప్రతినిధులు రూ.1.20 లక్షల పీఎల్‌ఆర్‌ను డిమాండ్ చేయగా, యాజమాన్యం రూ.1.08 లక్షలు ప్రతిపాదించినట్లు సమాచారం. అనంతరం ఇరువర్గాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరగడంతో చివరకు రూ.1,10,250 పీఎల్ఆర్ చెల్లించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 1, 2026 నాటికి కోల్ ఇండియాలో 1,96,753 మంది నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. నిబంధనల ప్రకారం అర్హులైన పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా పీఎల్ఆర్ ప్రయోజనం లభించనుంది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య పదవీ విరమణ చేసిన సుమారు 8,351 మంది కార్మికులు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లోని సుమారు 32 వేల మంది ఉద్యోగులకు కూడా పీఎల్ఆర్ వర్తించే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశంలో యూనియన్ల తరఫున బీఎంఎస్ నుంచి కె. లక్ష్మారెడ్డి, హెచ్ఎంఎస్ నుంచి హర్భజన్ సింగ్ సిధు, సీఐటీయూ నుంచి డి.డి. రామానందన్, ఏఐటీయూసీ నుంచి లఖన్‌లాల్ మహతో పాల్గొన్నారు. యాజమాన్యం తరఫున మార్కెటింగ్ డైరెక్టర్, మానవ వనరుల ఇన్చార్జి ముఖేష్ చౌదరి, ఫైనాన్స్ డైరెక్టర్ ముఖేష్ అగర్వాల్ పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, పీఎల్ఆర్ చర్చల్లో తమ ప్రతినిధిని చేర్చాలని కోరుతూ ఐఎన్టీయూసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, శనివారం ఆ పిటిషన్ విచారణకు జాబితా కాలేదని సమాచారం.