గతాన్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి

02-10-2026 | 06:05pm

ఖైదీలకు జిల్లా కలెక్టర్ కె. హరిత సూచన

ఆసిఫాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): గతంలో జరిగిన తప్పుల గురించి ఆలోచించకుండా భవిష్యత్తుపై దృష్టి సారించి సద్ప్రవర్తనతో మెలగాలని జిల్లా కలెక్టర్ కె. హరిత(District Collector K. Haritha) ఖైదీలకు సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అనూష, అదనపు ఎస్పీ చిత్తరంజన్, జైలర్ ప్రవీణ్‌తో కలిసి  జైలును ఆమె సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జైలులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని సన్మార్గంలో పయనిస్తే తిరిగి కుటుంబంతో, సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని ప్రారంభించవచ్చన్నారు. జైలులో అందిస్తున్న వివిధ ఉపాధి శిక్షణ కార్యక్రమాలను ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణలు విడుదలైన తర్వాత ఉపాధి పొందేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.

విద్యపై ఆసక్తి ఉన్న ఖైదీలు ఓపెన్ స్కూలింగ్, దూరవిద్య, ఓపెన్ యూనివర్సిటీ కోర్సుల ద్వారా విద్యార్హతలను పెంపొందించుకునే అవకాశం ఉందన్నారు. జైళ్లలో ఖైదీలకు గాలి, నీరు, వెలుతురు, పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఖైదీలు జైలు వాతావరణాన్ని సానుకూలంగా మలుచుకొని సన్మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ఖైదీలకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, జైలు సిబ్బంది, ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు