రూ.813 కోట్ల పరిహారం రైతులకు చేరాలి

22-09-2026 | 05:35am
  1. ప్రాజెక్టుల భూనిర్వాసితులకు వెంటనే అందాలి
  2. నిధులు ప్రభుత్వ ఖాతాల్లోనే ఉంటే సహించేది లేదు
  3. కలెక్టర్లు స్వయంగా జోక్యం చేసుకోవాలి
  4. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకే రూ.6 వేల కోట్లకు సీఎం హామీ
  5. రైతులతో మానవీయంగా వ్యవహరించాలి
  6. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): భూసేకరణ, పునరావాసం(Land Acquisition and Rehabilitation) ఇప్పటికే విడుదల చేసిన రూ.813 కోట్లను ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత రైతులకు అందించాలని జిల్లాల కలెక్టర్లు, అధికారులను నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) ఆదేశించారు. నిధులు విడుదలైనా ప్రభుత్వ ఖాతాల్లోనే ఉండిపోవడం, మరోవైపు భూసేకరణ పూర్తికాక సాగునీటి ప్రాజెక్టులు(Irrigation Projects) నిలిచిపోవడం సమంజసం కాదని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం- పునర్వ్యవస్థీకరణ పనులు, పరిహారం చెల్లింపుల పురోగతిపై సోమవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, భూసేకరణ కమిషనర్ శివకుమార్‌నాయుడు పాల్గొన్నారు.

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు భూసేకరణ, పునరావాసం- పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రూ.3,101 కోట్ల విలువైన టోకెన్‌లు సమర్పించగా, ప్రభుత్వం రూ.2,504 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో ఉన్న రూ.813 కోట్లలో రూ.502 కోట్లు భూసేకరణ అధికారుల వద్ద, మరో రూ.311 కోట్లు కలెక్టర్ల వద్ద ఉన్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు విడుదలైన తరువాత అవి తప్పనిసరిగా భూములు కోల్పోయిన రైతులకు చేరాలని స్పష్టం చేశారు.

కలెక్టర్లు వ్యక్తిగతంగా చొరవ తీసుకొని రైతులతో సంప్రదింపులు జరిపి అవార్డుల ప్రక్రియ, పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతులకు పరిహారం చెల్లించడం సాధ్యం కాకపోతే, అందుకు గల కారణాన్ని స్పష్టంగా తెలియజేసి నిధులను తిరిగి ప్రభుత్వానికి పంపాలని సూచించారు. అలా కాకుండా నెలల తరబడి ఖాతాల్లో ఉంచడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతుల అవసరాల కోసం 2026లో రూ.6 వేల కోట్లు అందిస్తామని సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ప్రాధాన్య ప్రాజెక్టుల పనులు నిధుల కొరతతో ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ మొత్తాన్ని నీటిపారుదల శాఖ సాధారణ బడ్జెట్‌కు అదనంగా సమకూరుస్తున్నట్లు మంత్రి తెలిపారు.

రైతుల పట్ల మానవీయంగా వ్యవహరించాలి..

భూములు కోల్పోతున్న రైతుల పట్ల అధికారులు న్యాయబద్ధంగా, మానవీయంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. అవార్డులు జారీ చేసి, చెల్లింపులకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరువాతే టోకెన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. అవార్డు ప్రకటించిన తరువాత కూడా పరిహారం చెల్లింపులు ఆలస్యమైన కేసుల్లో నిబంధనల ప్రకారం రైతులకు వడ్డీ చెల్లించాలని ఆదేశించారు. కోర్టు కేసులు, యాజమాన్య వివాదాల కారణంగా నిలిచిపోయిన భూసేకరణ కేసులన్నింటినీ ప్రత్యేకంగా నమోదు చేసి, అడ్వొకేట్ జనరల్‌తో చర్చించి వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

నల్గొండ, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, సిద్దిపేట, వికారాబాద్, జగిత్యాల, హనుమకొండ తదితర జిల్లాల్లో భూసేకరణకు ఎదురవుతున్న సమస్యలను మంత్రి జిల్లాలవారీగా సమీక్షించారు. నల్గొండ జిల్లాలోని చింతపల్లి రిజర్వాయర్, పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఉదయసముద్రం, నెల్లికల్లు ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో జాప్యంపై ఆరా తీశారు. ముఖ్యంగా ఎస్‌ఎల్బీసీ సొరంగం పూర్తయిన తరువాత దాని ప్రయోజనాలు రైతులకు అందాలంటే పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూసేకరణను అత్యవసరంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఎస్‌ఎల్బీసీ సొరంగం పూర్తయినా, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు అవసరమైన భూసేకరణ పూర్తికాకపోతే పెట్టిన పెట్టుబడికి ఆశించిన ప్రయోజనం దక్కదని మంత్రి హెచ్చరించారు. భూసేకరణ ప్రక్రియలో రెండు, మూడు వారాల సమయాన్ని సాధారణ పరిపాలనా జాప్యంగా భావించవద్దని కలెక్టర్లకు సూచించారు. ప్రతి దశకు నిర్దిష్ట గడువు పెట్టుకొని సాధ్యమైనంత తక్కువ సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అనేక సాగునీటి ప్రాజెక్టుల ప్రధాన పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, పంపిణీ కాలువలు, అనుసంధాన పనులు, కొద్దిపాటి భూసేకరణ పెండింగ్‌లో ఉండటంతోనే వాటి ఫలాలు రైతులకు అందడం లేదని తెలిపారు.

అందువల్ల భూసేకరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ చెల్లింపులకు కేసులు పూర్తిగా సిద్ధమైన తరువాతే నిధులను కోరాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఖాతాల్లో నిరుపయోగంగా ఉండకుండా జాగ్రత్త వహించాలని, ఆర్థిక వనరులను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు