కాంగ్రెస్ నిరంకుశ పాలన

08-09-2026 | 05:35am
  1. 22ఏపై బీజేపీ పోరాటం ఆగదు

ప్రశ్నిస్తే అరెస్టులు.. నిలదీస్తే నిర్బంధాలా? 

ఇదేనా కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యం ముసుగులో కాంగ్రెస్ నిరంకుశ పాలన సాగిస్తుందని, విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టి.. బారికేడ్ల వెనుక దాక్కుంటారా?, ఫీజు బకాయిలు చెల్లించేవరకు, 22ఏ భూదందాపై విచరాణ జరిపేదాకా బీజేపీ పోరాటం ఆగదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ధర్నాకు చోటివ్వరు.. అసెంబ్లీ వద్దకు శాంతియుతంగా వస్తే లాఠీలతో విరుచుకుపడతారా?, ప్రశ్నిస్తే అరెస్టులు.. నిలదీస్తే నిర్బంధాలు..

ఇదేనా కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన? అని ప్రశ్నించారు. బీజేపీ నేతల అరెస్టుపై కిషన్ రెడ్డి ఈ మేరకు స్పందిస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అందిస్తామని గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజా సమస్యలపై గొంతెత్తితే అరెస్టులు, ప్రశ్నిస్తే నిర్బంధాలు, నిరసన తెలిపితే లాఠీలతో సమాధానం చెబుతోందని మండిపడ్డారు.

ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన? ఇదేనా రాహుల్ గాంధీ పదేపదే మాట్లాడే ప్రజాస్వామ్యం? అని నిలదీశారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, వివాదాస్పద 22-ఏ జాబితాలో చేర్చిన అమాయక ప్రజల ప్రైవేటు భూములకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ వైపు శాంతియుతంగా వెళ్తున్న బీజేపీ నాయకులు,

కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల గొంతుకగా నిలబడేందుకు బీజేపీ తరపున ఉద్యమబాట పట్టిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావుని అసెంబ్లీ వద్ద అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. 

ప్రభుత్వానికి భయమెందుకు?

ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ వైపు వస్తేనే ప్రభుత్వానికి అంత ఉలికిపాటు ఎందుకన్నారు. సభ లోపల బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అడ్డుకోవడం.. సభ బయట ప్రజల తరఫున గొంతెత్తుతున్న బీజేపీ నాయకులను పోలీసులతో అరెస్టు చేయించడం.. ఇది ప్రజాస్వామ్య పాలన కాదని, పక్కా నియంతృత్వమన్నారు. ధర్నాచౌక్‌లో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అవకాశం ఇవ్వరని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అసెంబ్లీ వద్దకు వస్తే బారికేడ్లు పెడుతున్నారని, కార్యకర్తలపై లాఠీలు ప్రయోగిస్తున్నారని పేర్కొన్నారు.

సమాధానం చెప్పకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారని తెలిపారు. అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలే రని, లాఠీలతో విద్యార్థుల సమస్యలను పరిష్కరించలేరన్నారు. అదే సమయంలో రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 22-ఏ భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర న్యాయ విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాల్సందే అన్నారు.

అరెస్టులకు భయపడేది లేదని, నిర్బంధాలకు వెనక్కి తగ్గేది లేదని, లాఠీలకు తలవంచేది లేదని, విద్యార్థులకు న్యాయం జరిగేదాకా.. 22-ఏ బాధితులకు న్యాయం జరిగేదాకా.. ప్రజల పక్షాన బీజేపీ పోరాటం ఆగదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు