డీఈవోలు కావలెను!

22-09-2026 | 05:50am

33 జిల్లాలు.. మంజూరైన పోస్టులు 12

రెగ్యులర్ డీఈవోలు నలుగురైదుగురే 

  1. రెండు దశాబ్దాలుగా రిటైర్మెంట్స్ తప్ప భర్తీ లేదు
  2. సర్దుబాటుతోనే సరి.. ఇన్‌ఛార్జులతోనే ముందుకు! 
  3. ఒక్కో డీఈవోకు మూడు జిల్లాల బాధ్యతలుnనామ్‌కే వాస్తేగా పాఠశాలల తనిఖీలు
  4. గాడితప్పుతున్న విద్యా వ్యవస్థ  

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో జిల్లాలకు తగ్గట్టుగా డీఈవో పోస్టులు(DEO posts) లేకపోవడంతో విద్యా వ్యవస్థ(Education System) గాడితప్పుతున్నది. ఒక్కో అధికారి రెండు మూడు జిల్లాలను పర్యవేక్షించాల్సి రావడంతో సమస్యలు తిష్టవేస్తున్నాయి. 33 జిల్లాలు ఉంటే.. మంజూరైన జిల్లా విద్యాశాఖ అధికారుల(District Education Department officials) (డీఈవో) పోస్టులు 12 మాత్రమే.

ఆ పన్నెండు పోస్టుల్లోనూ నలుగురైదుగురు తప్ప మిగతా చోట్ల రెగ్యులర్ డీఈవోలు లేరు. 2006 నుంచి తెలంగాణలో డీఈవోలు, ఎంఈవోలు రిటైరవుతున్నారు తప్పితే వారి స్థానంలో కొత్తగా నియామకాలుగానీ, పదోన్నతులు గానీ జరగడం లేదు. ఇన్‌ఛార్జీలతోనే పాఠశాల విద్యాశాఖ(Department of School Education)ను నెట్టుకొస్తున్నారు.  

21 జిల్లాలకు మంజూరెప్పుడో?

ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు డీఈవో పోస్టులు మంజూరు చేయాల్సి ఉంటుంది. పన్నెండేండ్ల కింద 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా.. ఆ తర్వాత రెండేండ్లలో జిల్లాల సంఖ్య 33కు చేరింది. అప్పట్లో ఉమ్మడి పది జిల్లాలతోపాటు భద్రాచలం ఏజెన్సీ పరిధి (భద్రాద్రి కొత్తగూడెం), ఉట్నూరు ఏజెన్సీ పరిధి (మంచిర్యాల గిరిజన ప్రాంతం)కి కొత్తగా డీఈవో పోస్టులు మంజూరయ్యాయి. 33 జిల్లాలకు గాను 12 డీఈవో పోస్టులే శాంక్షన్ అయ్యాయి.

ఇప్పుడున్న జిల్లాలతో పోలిస్తే ఇంకా 21 పోస్టులు మంజూరుకావాల్సి ఉంది. అవి ఎప్పుడు మంజూరవుతాయన్నది ప్రశ్నార్థకమే. జిల్లాలకు తగ్గ పోస్టులు లేకపోవడంతో ఒక్కో అధికారి రెండు, మూడు జిల్లాల ఇన్‌చార్జ్ బాధ్యతలు చూడాల్సి వస్తున్నది. మంచిర్యాల, హైదరాబాద్, సంగారెడ్డితోపాటు ఒకట్రెండు జిల్లాలకు మాత్రమే రెగ్యులర్ డీఈవోలు ఉన్నారు.

మిగిలిన జిల్లాలకు అసిస్టెంట్ డైరెక్టర్లు, డైట్ కాలేజీల లెక్చరర్లకు డీఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తే.. మరికొన్ని చోట్ల జిల్లా పరిషత్ సీఈవోలు, ఇంటర్ విద్యాధికారులకు డీఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక, రాష్ట్రంలో మండలాల సంఖ్య 630కి చేరగా.. ఇంకా 142 ఎంఈవో పోస్టులు మంజూరు కావాల్సి ఉంది. ఇక్కడ కూడా ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. 

పర్యవేక్షణేది..?

సరిపడా విద్యాధికారులు లేకపోవడంతో విద్యాశాఖపై పర్యవేక్షణ కరువవుతున్నది. బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించడం, విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుపై నిఘా పెట్టడం లాంటివి సమస్యలుగా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పాఠశాలల తనిఖీలకు సీనియర్ టీచర్లను పంపిస్తుండటంతో విద్యార్థులు క్లాసులను కోల్పోతున్నారు. ఇటీవల విద్యాశాఖ ఏర్పాటు చేసిన పాఠశాలల ఇన్‌స్పెక్షన్ టీమ్‌లను సైతం ఉపాధ్యాయులతోనే వేశారు. వీరితో పెద్దగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చని పలు ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.

రెగ్యులర్ డీఈవోలు, రెగ్యులర్ ఎంఈవోలు ఉంటేనే పర్యవేక్షణ సజావుగా ఉండటంతోపాటు ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఒకవైపు ప్రభుత్వం నాణ్యమైన విద్య అంటూ చెప్తున్నా.. మరోవైపు ఆ నాణ్యతను పర్యవేక్షించాల్సిన వ్యవస్థే సరిగ్గా లేదని, డీఈవో పోస్టులు మంజూరు కాకపోవడమే ఇందుకు నిదర్శనమని ఉపాధ్యాయ సంఘా లు అంటున్నాయి. వెంటనే పోస్టులను శాంక్షన్ చేసి, భర్తీ చేయాలని కోరుతున్నాయి. 

మరిన్ని వార్తలు