అభివృద్ధి పథంలో తెలంగాణ: డిప్యూటీ సీఎం భట్టి
ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సిఎం
ఖమ్మం/ఖమ్మం టౌన్: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Deputy CM Bhatti Vikramarka Mallu) స్థానిక పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, సెప్టెంబర్ 17న భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య పాలనలోకి అడుగుపెట్టిన తెలంగాణ 1,000 రోజుల ప్రజా పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం ఉద్యమించిన యోధుల వెలకట్టలేని త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం పూర్తి చేసుకున్న పాలనలో పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యతనిచ్చామని డిప్యూటీ సీఎం తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రూ. 500 కే గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో మహిళలు ఉచిత ఆర్టీసీ ప్రయాణాల ద్వారా రూ. 343.44 కోట్లు ఆదా చేసుకున్నారని వివరించారు.
రైతు భరోసా ద్వారా ఖమ్మం జిల్లాలోని 3,41,913 మంది రైతులకు రూ. 427.96 కోట్లు అందించామని, పంట రుణమాఫీ కింద 1,31,760 మంది రైతులకు రూ. 912.61 కోట్ల రుణభారం నుంచి విముక్తి కల్పించామని తెలిపారు. ఖమ్మం నగరాన్ని వరదల నుంచి రక్షించేందుకు రూ. 525.36 కోట్లతో వరద రక్షణ గోడ నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తూ ఆసుపత్రులలో అత్యాధునిక వైద్య వసతులను కల్పిస్తున్నామని తెలిపారు.