విద్యార్థుల భవిష్యత్ కు అండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం
నాణ్యమైన విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ అల్పాహార కార్యక్రమం
ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు హామీ
70 కోట్లతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు అండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుంటుందని , నాణ్యమైన విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహార కార్యక్రమాలు ఏర్పాటు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Chintakunta Vijaya Ramana Rao) అన్నారు, మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సహకారంతో హరే రామ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్పాహార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు, ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విజయరమణ రావు మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఉదయాన్నే వ్యవసాయ, ఇతర పనులకు వెళ్లిపోతుండటంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందించే విషయంలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు అల్పాహారాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.
వారానికి ఆరు రోజుల పాటు ఇడ్లీ- సాంబార్, పూరీ- ఆలూ కుర్మా, దోస, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ- సాంబార్, బోండా తదితర అల్పాహారం తోపాటు పాలు అందిస్తున్నట్లు వివరించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఇప్పటివరకు రూ.70 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ విప్ విజయరమణ రావు తెలిపారు. కాంపౌండ్ వాల్స్, నూతన పాఠశాల భవనాలు, మరుగుదొడ్లు, భవనాల ఆధునీకరణతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పడటంతో ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని పేర్కొన్నారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఏడాది కాలంలో పనులు పూర్తి చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థు ల హాస్టళ్లను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసి, అందరికీ సమాన విద్య అందించే లా చర్యలుతీసుకుంటున్నామని చెప్పారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులకు అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రానున్న కాలంలో ఓదెలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.అలాగే గర్రెపల్లి పాఠశాలలో విద్యార్థులు, గ్రామస్తుల కోరిక మేరకు ఓపెన్ జిమ్,వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు అలాగే గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య , మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ , కల్లేపల్లి జానీ, పడాల అజయ్ గౌడ్, దన్నాయకు దామోదర్ రావు, పన్నాల రాములు, ఎంపీడీవో దివ్యదర్శనరావు,ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య, పలు గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, గ్రామపంచాయతీ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.