పేదలకు గౌరవం

22-09-2026 | 05:30am
  1. ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ టవర్స్
  2. అర్హులైన ప్రతి నిరుపేద సొంతింటి కలను తీర్చుతాం
  3. పారదర్శకంగా లాటరీ ఎంపిక
  4. వాట్సాప్‌లోనే శాంక్షన్ లెటర్లు, ఉచిత రిజిస్ట్రేషన్ 
  5. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి 
  6. రాయదుర్గంలో 480 ఫ్లాట్లకు శంకుస్థాపన

రంగారెడ్డి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం(Hyderabad City)లోని అత్యంత విలువైన ప్రాంతాల్లో పేదలు గౌరవంగా జీవించే అవకాశం కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం(Serilingampally Constituency), రాయదుర్గం(Raidurgam)లో నిర్మించనున్న నాలుగు టవర్లలో ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్ల చొప్పున మొత్తం 480 ఫ్లాట్ల నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద కుటుంబాల కష్టాలను దృష్టిలో ఉంచుకుని వారికి భద్రత, భరోసా కల్పించేందుకే నగరానికి దూరంగా కాకుండా నగర నడిబొడ్డున ఈ ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.  హైదరాబాద్ కోర్ ప్రాంతంలోని 20 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గానికి 480 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నామని, ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో టెండర్లు, అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు.

లబ్ధిదారుల ఎత్తుకొని ఎలాంటి పక్షపాత ధోరణి, ఎలాంటి రాజకీయ సిఫార్సులకు తావులేకుండా కేవలం అర్హత, పేదరికమే ప్రామాణికంగా పారదర్శక లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేశారన్నారు. ఎంపికైన వారికి నేరుగా వారి మొబైల్ వాట్సాప్‌(Mobile WhatsApp)కే శాంక్షన్ లెటర్లను పంపిస్తున్నామని చెప్పారు. ఫ్లాట్‌తో పాటు ల్యాండ్ అన్డివైడెడ్ షేర్ కూడా లబ్ధిదారులకు లభిస్తుందని, రిజిస్ట్రేషన్ చార్జీలను ప్రభుత్వమే భరించి, ఉచితంగా సేల్ డీడ్  అందజేస్తుందని చెప్పారు.

నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యతను లబ్ధిదారులు స్వయం గా పరిశీలించవచ్చని, ఎలాంటి లోపాలున్నా అధికారుల దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో దసరా నాటికి సుమారు 2.10 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభు త్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీ దయానంద్, కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, హౌసింగ్ ఎండీ గౌతమ్ కుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు