కిం కర్తవ్యం! గెలిచి ఏం ఫాయిదా?

01-10-2026 | 05:05am

కేసముద్రం మున్సిపల్ కౌన్సిలర్ల అంతర్మధనం 

కేసముద్రం, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ప్రకటించడంతో తామే ఇక కీలకంగా రాజకీయంగా చక్రం తిప్పవచ్చని భావించిన మున్సిపల్ కౌన్సిలర్లకు ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుండడంతో.. ఏం చేయాలో తోచని అయోమయ పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

కౌన్సిలర్లుగా ఎన్నికై ఎనిమిది నెలలు గడుస్తున్నా పావలా పని చేయలేకపోయామని, గెలిచి ఏం ఫాయిదా అంటూ.. భవిష్యత్తుపై అంతర్మదనంలో పడ్డారని ప్రచారం సాగుతోంది. కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, దనసరి, సబ్ స్టేషన్ తండా, అమీనాపురం గ్రామాలను విలీనం చేస్తూ రెండేళ్ల క్రితం కేసముద్రం మున్సిపాలిటీ(Kesamudram municipality)గా ఏర్పాటు చేశారు. అనంతరం మున్సిపాలిటీకి 16 వార్డులను ఏర్పాటు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించారు. 8 మంది కాంగ్రెస్, మరో 8 మంది బీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు.

ఎంపీ పోరిక బలరాం నాయక్ ఎక్స్ అఫీషియో ఓటుతో  కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన బానోతు సునీత, వైస్ చైర్ పర్సన్ గా డాక్టర్ అల్లం రామ ఎన్నికయ్యారు. బోటా బోటి మెజారిటీతో మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవులను కైవసం చేసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో ఏ పని చేయాలన్నా ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతి అంశంలో ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు గట్టిగా పట్టుబడుతుండడంతో ఏ పని చేయపట్టాలన్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది.

ఇదిలా ఉంటే 16 మంది కౌన్సిలర్లు ఇప్పటివరకు తమ వార్డుల్లో సొంతంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేక చేష్టలుడికి పోతున్నారు. 62 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ ఆ పనులన్నీ కూడా టెండర్ విధానంలో చేపడుతుండడంతో కౌన్సిలర్లకు ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా చిన్నచిన్న పనులు కూడా తాము నిర్వహించలేని పరిస్థితి మున్సిపాలిటీలో ఉండడంతో గ్రామపంచాయతీ గా ఉన్నప్పుడే కాస్త నయంగా ఉండేదని వాపోతున్నారు.

లక్ష రూపాయలకు మించి ఏ పని చేయాలన్నా టెండర్ విధానం అమలు చేస్తుండడంతో కౌన్సిలర్లకు మింగుడు పడని వ్యవహారంగా మారిందని చెబుతున్నారు. కనీసం వార్డుల్లో తాగునీటి ఇబ్బంది తొలగించలేని పరిస్థితి నెలపొందని వార్డు కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచి ఏం ప్రయోజనం లేకుండా పోయిందని లోపల కుమిలిపోతున్నారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సహకారంతో కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పడి, కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు.

కొత్తగా మున్సిపాలిటీ భవనం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వాటర్ స్కీమ్, డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, డివైడర్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, ఆర్టీసీ బస్ కాంప్లెక్స్, ఫైర్ స్టేషన్, డిగ్రీ కళాశాల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ పాలిటెక్నిక్ నిర్మాణం, 50 పడకల ఆసుపత్రి, పోలీస్ సర్కిల్ కార్యాలయం, మెప్మా కార్యాలయం తదితర అభివృద్ధి పనులన్నీ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

అయితే ఈ పనుల్లో కౌన్సిలర్లకు ఎలాంటి ప్రమేయం లేకుండా పోవడంతో పాటు కనీసం తాము చేశామని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందని, ఇక మున్సిపాలిటీలో ఏదైనా పని చేయాలంటే పూర్తిగా అధికారుల అధిపత్యమే కొనసాగుతోందని, దీనితో తాము కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని కుమిలిపోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒక్కో వార్డులో గెలుపొందిన అభ్యర్థి, ఓడిన అభ్యర్థి కనీసం తక్కువలో తక్కువ పాతిక లక్షలకు పైగా వార్డుకు 50 లక్షల వరకు ఎన్నికల్లో ఖర్చుపెట్టినట్లు అప్పట్లో ప్రచారం సాగింది.

ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఓవైపు, ఓడిన వాళ్ళు మరోవైపు ఇరువర్గాలు సంతోషంగా లేరనే ప్రచారం సాగుతోంది. పంచాయతీగా ఉన్నప్పుడే కాస్త నయంగా ఉండేదని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే పరిస్థితి ఉండేదని, సర్పంచ్, వార్డు సభ్యులుగా తమకు ప్రజల్లో గుర్తింపు ఉండేదని, ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన ఖర్చు రాబట్టుకునే పరిస్థితి లేకపోవడంతో ‘కౌన్సిలర్’ పదవి ‘అలంకారప్రాయం’గా మారిందని పలువురు బాహటంగానే పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు