నేరాల నియంత్రణలో రాజీ లేకుండా పనిచేయాలి
నెలవారీ నేర సమీక్షా సమావేశంలోజిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): నేరాల నియంత్రణ(Crime control)లో రాజీ లేకుండా పని చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(District SP Sirisetti Sankeerth) పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతలు, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దొంగతనాల నియంత్రణకు గస్తీ, నిఘా పెంచాలని, సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాలను చేదించాలని, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోక్ సో కేసుల్లో ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. ఈనెల 12న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామ స్థాయి పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీ సంపత్ రావు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు, ఎస్సైలు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.